ఎండ వేడిమికి అడవుల్లోని నీటికుంటలు పూర్తిగా ఎండిపోవడంతో మూగజీవులు అల్లాడిపోతున్నాయి. దీంతో నీటి కోసం అడవులను వదిలి జనావాసాల్లోకి వస్తూ ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఇలాగే ఓ జింక ప్రమాదానికి గురై మరణించిన విషాద సంఘటన వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. 

అనంతగిరి అటవీ ప్రాంతంలో ఓ జింక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన  అధికారులు వాహనం ఢీ కొట్టడం వల్ల జింక మృతిచెందినట్లు తెలిపారు. అక్కడే పంచనామా  నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జింక మృతదేహాన్ని దగ్గర్లోని పశువైద్యశాలకు తరలించారు. 

అయితే ఎండవేడికి తట్టుకోలేక నీటికోసం జనావాసాల్లోకి వస్తూ గతకొంత కాలంగా అటవీ జంతువులు మృతిచెందుతున్నట్లు అధికారులు తెలిపారు.అంతేకాకుండా కొందరు వేటగాళ్లు కూడా తమ సరదాకోసం మూగజీవులు ప్రాణాలు తీస్తున్నారని...అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఈ జింక మాత్రం  ప్రమాదం కారణంగానే  చనిపోయినట్లు ప్రాథమిక  నిర్ధారణకు వచ్చినట్లు అటవీ అధికారులు వెల్లడించారు. 

వీడియో