ములుగు జిల్లాలో ఓ వింత వ్యాధి కలకలం రేపుతోంది. అంతుచిక్కని అనారోగ్యంతో జనాలు హఠాత్తుగా చనిపోతున్నారు. అంతుపట్టని ఈ సమస్యతో ఇప్పటికే ఒకే కాలనీకి చెందిన ఆరుగురి ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉండటం విషాదం. 

జిల్లాలోని కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి ఎస్సీ కాలనీలో 70 కుటుంబాలు ఉండగా, 20 రోజుల వ్యవధిలో ఆరుగురు మృతి చెందారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. మొదటి రోజు జ్వరం ఆ తరువాత రెండు రోజుల్లో కడుపు ఉబ్బి చనిపోతున్నారు. అయితే వీరు ఇలా ఎందుకు చనిపోతున్నారో, దేనివల్ల ఇలా ప్రాణాలమీదికి వస్తుందో కారణాలేంటో తెలియరావట్లేదు. 

కాలనీకి చెందిన వారు ఒక్కొక్కరుగా మృత్యువాత పడుతుండటంతో మిగతా కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే, కలుషిత నీరే కారణమై ఉండొచ్చని డీఎంహెచ్‌ఓ అప్పయ్య అనుమానం వ్యక్తం చేశారు. గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, 72 మందికి వైద్యపరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.