పెన్‌పహాడ్: సూర్యాపేట జిల్లాలోనిపెన్‌పహాడ్ మండల పరిధిలోని నాగులపహాడ్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై పొరుగునే నివాసం ఉండే ఆలేందర్  అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన బాధిత కుటుంబం పెద్ద మనుషులను ఆశ్రయిస్తే బాలిక శీలానికి వెల కట్టారు.

సూర్యాపేట జిల్లాలోని పెన్‌పహాడ్ గ్రామానికి చెందిన బాలిక తండ్రితో కలిసి గ్రామంలోనే ఉంటుంది. బాలిక తల్లి ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లింది. అక్కడే ఆమె ఉంటుంది. అయితే ఈ బాలికపై కన్నేసిన పక్కింటికి చెందిన ఆలేందర్ ఐదు మాసాల క్రితం బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఐదు మాసాల నుండి వీలు చిక్కినప్పుడల్లా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు.

ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బాలికను బెదిరించాడు.  ఆ బాలిక తండ్రి అనారోగ్యంతో మరణించాడు. విషయం తెలుసుకొన్న బాలిక తల్లి స్వగ్రామానికి చేరుకొంది. ఇంటి వద్దే ఉంటుంది. అయితే ఇదే సమయంలో ఆ బాలిక అనారోగ్యానికి గురైంది.

ఆసుపత్రికి తీసుకెళ్తే బాలిక గర్భవతి అని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో ఆ బాలికను తల్లి నిలదీస్తే అసలు విషయాన్ని బాలిక చెప్పింది. ఈ విషయమై బాలిక తనకు న్యాయం చేయాలని గ్రామ పెద్దలను ఆశ్రయించింది. అయితే రూ. 5 వేలు ఇస్తాను. అబార్షన్ చేయించుకోవాలని ఆలేందర్ చెప్పాడు. ఇదే విషయమై ఎంతో కొంత పరిహారం ఇప్పిస్తామని కొందరు  గ్రామ పెద్దలు బాధిత కుటుంబానికి  సర్ధి చెప్పే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది.