టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు మరో షాకిచ్చింది అలందా మీడియా. ఆయన వాడుతున్న ఖరీదైన కార్లను టీవీ9 యాజమాన్యం స్వాధీనం చేసుకుంది. టీవీ9 నుంచి రవిప్రకాశ్‌ను తొలగించినప్పటికీ.. కంపెనీ వాహనాలను మాత్రం తిరిగి ఇవ్వలేదు.

దీంతో అలంద మీడియా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమ వాహనాలను తిరిగి ఇప్పించాలని యాజమాన్యం కోర్టును కోరింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం..  రవిప్రకాశ్ వాడుతున్న ఖరీదైన వాహనాలను అలంద మీడియా యాజమాన్యానికి స్వాధీన పరచాలని పోలీసులను ఆదేశించింది.

కోర్టు ఆదేశాలతో రవిప్రకాశ్ ఇంటికి చేరుకున్న పోలీసులు కార్లను సీజ్ చేశారు.. అనంతరం రవిప్రకాశ్‌ డ్రైవర్ల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఇంటికి ఎలా వస్తారని రవిప్రకాశ్‌ భార్య పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తీవ్ర ఆర్ధిక నేరాలకు పాల్పడిన రవిప్రకాశ్‌‌ కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని..  కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండేలా చేయగలరని బెయిల్ ఇవ్వొద్దని న్యాయవాదులు గతంలోనే కోరిన సంగతి తెలిసిందే.

రవిప్రకాశ్‌పై దాఖలైన ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.