తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రముఖ పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాయి. ముఖ్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి పార్టీలన్నీ అధికారంలోకి రాగానే చేసే పనుల గురించి హామీలిస్తున్నాయి. అయితే గత టీఆర్ఎస్ మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తమ ప్రచారానికి అనుకూలంగా మార్చుకుని మహిళా ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడింది. 

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ మహిళా అధ్యక్షురాలు సుస్మితాదేవ్ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... టీఆర్ఎస్ పార్టీ మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించకుండా అవమానపర్చిందని మండిపడ్డారు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలను మంత్రివర్గంలో తీసుకోవడం కాదు...ఏకంగా ముఖ్యమంత్రిని చేయడానికి ప్రయత్నిస్తామన్నారు.

తెలంగాణలో మహిళా అభ్యర్థిని ముఖ్యమంత్రి చేయాలని తానే స్వయంగా రాహుల్ గాంధీని కోరతానని సుస్మితాదేవ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం పదవి చేపట్టే అనుభవం,అర్హతలు చాలా మంది అభ్యర్థులకు ఉన్నాయని సుస్మితా స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ పార్టీ మహిళా సాధికారత కోసం అనేక పథకాలను రూపొందించిందని అన్నారు. గత ప్రభుత్వం మహిళలను పూర్తిగా  విస్మరించిందని.... మంత్రిమండలిలోకి  తీసుకోకపోవడంతో పాటు కనీసం మహిళా కమీషన్ ను కూడా ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మహిళలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలవాలని సుస్మితా దేవ్ సూచించారు.