Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రంలో టీఆర్ఎస్, దేశంలో బీజేపీని గద్దెదించాలి:రాహుల్ గాంధీ పిలుపు

తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రజాకూటమి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. 

aicc president rahulgandhi fires on kcr
Author
Armoor, First Published Nov 29, 2018, 3:49 PM IST

ఆర్మూర్: తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రజాకూటమి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. 

ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో అంచనాలు పెంచేశారు. కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణ వస్తే తమ భవిష్యత్ బాగుంటుందని విద్యార్థులు భావించారు. కానీ వారి ఆశలను ఆడియాశలు చేశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని తన కుటుంబానికి వినియోగించుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. 

కేసీఆర్ మాయమాటలతో తెలంగాణ రాష్ట్రప్రజలను మోసం చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు రూ.17వేల కోట్లు మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఉందని అయితే టీఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణను అప్పులపాల్జేశారని ఆరోపించారు. 

కానీ కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ ఆస్తులు మాత్రం 400శాతం పెంచుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో 4వేల 500 మంది రైతులు ఆత్మహత్ చేసుకున్నారని ఆరోపించారు.రైతులు మద్దతు ధర అడిగితే కేసీఆర్ లాఠీలతో కొట్టించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.2లక్షలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.  

ఆర్మూర్ నియోజకవర్గంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. పసుపుకు మద్దతు ధర రూ.10వేలు అందజేస్తామన్నారు. భూసేకరణ చట్టానికి కూడా కేసీఆర్ నీళ్లొదిలారని మండిపడ్డారు. 

భూసేకరణ చట్టాన్ని రద్దు చేసి భూములు లాక్కొంటున్నారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలను కేసీఆర్ గంగలో కలిపేశారని మండిపడ్డారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.2లక్షలు రుణామాఫీ చేస్తామని ప్రకటించారు. వరికి అలాగే 17 పంటలకు మద్దతు ధర ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. వరికి రూ.2వేలు, పత్తికి రూ.7వేలు, మిర్చికి రూ.10 వేలు, పసుపు రూ.10వేల రూపాయలు మద్దతు ప్రకటిస్తామని చెప్పారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుమార్తె కవిత తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కానీ నేటికి ఏర్పాటు చెయ్యలేదన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 

10 లక్షల మంది బీడీ కార్మికులను ఆదుకుంటాం. బీడీ ఉత్పాదకతపైన జీఎస్టీ 28 శాతం ఉందని దాన్ని రద్దు చెయ్యాలని కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జీఎస్టీని సమీక్షించి సరళితరం చేస్తామని హామీ ఇచ్చారు. 

బీడీ కార్మికుల సమస్యలను తాను పరిష్కరిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. విదేశాల్లో పని చేస్తున్న గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుందన్నారు. గల్ఫ్ బాధితుల కోసం 500కోట్ల రూపాయలతో వారిని ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

ఈ ఎన్నికల్లో ఓడిపోతే కేసీఆర్ ఫాం హౌస్ కు వెళ్లి విశ్రాంతి తీసుకుంటానని చెప్పారని అది వాస్తవమని చెప్పుకొచ్చారు. కేసీఆర్ విశ్రాంతి తీసుకునేది రూ.300కోట్ల రూపాయలతో నిర్మించిన భవంతిలోనని గుర్తు చేశారు. 

తెలంగాణ ప్రజలకు మాత్రం డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తానని హామీ ఇచ్చావ్, నిరుపేదలకు భూములు పంచుతానని చెప్పావ్ కానీ కేసీఆర్ మాత్రం 300కోట్ల రూపాయలతో భవనం కట్టించుకున్నారని ఆరోపించారు. 

దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టీరిని తెరిపించేందుకు 100 కోట్లు అవసరమైతే రూపాయి ఇవ్వలేదు కానీ 100లకోట్లతో భవంతులు నిర్మించుకుంటారా అంటూ ప్రశ్నించారు. 

కేసీఆర్ పెద్ద నోట్ల రద్దును సమర్ధించారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం పాలించాలని, ఢిల్లీని మోదీ పాలించాలన్నదే కేసీఆర్ లక్ష్యమంటూ రాహుల్ విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చాల్సిన అవసరం వచ్చిందని టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రసమితి కాదని తెలంగాణ ఆర్ఎస్ఎస్ అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర సంఘ్ పరివార్ అంటూ విమర్శించారు. 
 
ఢిల్లీలో నరేంద్రమోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజల కలను సాకారం చెయ్యలేదన్నారు. మన మెుదటి లక్ష్యం టీఆర్ఎస్ ను ఓడించాలి, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ లలో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. దేశంలో బీజేపిని ఓడించాలి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుటుంబ పాలన ఉండదని అందరికి ఆమోదయోగ్యమైన ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. మన్ కీ బాత్ చెప్పమని ప్రజల మాట వింటామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల సాకారం చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.  

Follow Us:
Download App:
  • android
  • ios