ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను కిరాతతకంగా హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జల్లా తల్లాడ మండలం రంగం బంజర్ కు చెందిన సంక్రాంతి సుబ్రహ్మణ్యేశ్వర రావు (65), విజయలక్ష్మి (60) దంపతులు విగతజీవులై కనిపించారు. 

వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఓ కూతురు విదేశాల్లో ఉంటుండగా, మరో కూతురు రామగుండంలో ఉద్యోగం చేస్తోంది. సుబ్రహ్మణ్యేశ్వర రావు, విజయలక్ష్మి దంపుతులు సొంత ఊరిలోనే ఉంటున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర రావు భార్యను కత్తితో నరికి చంపాడు. 

ఆ తర్వాత ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తల అలికిడి లేకపోవడంతో ఇరుగుపొరుగువారు వచ్చి చూశారు. వారికి ఇద్దరు విగతజీవులై కనిపించారు. విజయలక్ష్మి రక్తం మడుగులో పడి ఉండగా, సుబ్రహ్మణ్యేశ్వర రావు శవం ఆమె పక్కనే పడి ఉంది. 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘఠనకు కారణం ఏమై ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. కుటుంబ కలహాలు ఈ ఘటనకు కారణమా, మరేమైనా కారణాలున్నాయా అనే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.