హైదరాబాద్: హైదరాబాదులోని అమీన్ పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న హత్య కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. బావతో ఉన్న అక్రమ సంబంధం వల్లనే భర్తను మహిళ చంపినట్లు తేలింది. బావతో కలిసి ఆమె తన భర్తను మట్టుబెట్టింది. 

చత్తీస్ గడ్ దురుగు జిల్లా మరోదా గ్రామానికి చెందిన అనిల్ కుమార్ దారు (35) మూడు నెలల క్రితం మిత్రుడు హరినారాయణ అలియాస్ సంజీవుతో కలిసి అమీన్ పూర్ మండలంలోని సుల్తాన్ పూర్ కు వచ్చాడు. ఓ మెడికల్ డివైజ్ పార్కు సమీపంలో సెంటరింగ్ పనిచేసుకుంటూ అక్కడే నివాసం ఉంటున్నాడు.

పది రోజుల క్రితం తమ బావ సర్వోత్తంతో కలిసి అనిల్ కుమార్ దారు బార్య భువనేశ్వరి సుల్తాన్ పూర్ వచ్చింది. భువనేశ్వరి, సర్వోత్తం మధ్య వివాహేతర సంబంధం ఉంంది. అనిల్ కుమార్ దారును చంపేస్తే ఇద్దరం హాయిగా ఉండవచ్చునని వారు భావించారు. దాంతో అదివారంనాడు సర్వోత్తం అనిల్ కుమార్ ను సుల్తాన్ పూర్ మెడికల్ డివైజ్ పార్కు సమీపంలో ఉన్న గుట్టల్లోకి తీసుకుని వెళ్లి రాయితో తలపై బాది హత్య చేశాడు. 

అకస్మాత్తుగా అనిల్ కుమార్ కనిపించకపోవడంతో సంజీవు సర్వోత్తంను అడిగాడు. ఎవరో వచ్చి బైక్ మీద తీసుకుని వెళ్లారని సర్వోత్తం చెప్పాడు. అతను పలు చోట్ల గాలించాడు. కానీ అనిల్ కుమార్ జాడ కనిపించలేదు. దాంతో సర్వోత్తంను నిలదీశారు. తనకూ అనిల్ కుమార్ భార్యకు మధ్య అక్రమ సంబంధం ఉందని, దాంతో అనిల్ కుమార్ ను చంపేశామని చెప్పాడు. 

ఆ సమాచారాన్ని పోలీసులకు అందించడంతో వారు వచ్చి దర్యాప్తు సాగించారు మృతుడి భార్య భువనేశ్వరిని, సర్వోత్తంను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి మిత్రుడు సంజీవు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగించారు మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.