హైదరాబాద్: ఇద్దరు యువతుల మధ్య సంబంధం ఓ యువతి మరణానికి దారి తీసింది. తన ప్రియురాలు దూరం కావడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఒకే తరగతికి చెందిన యువతులు ఇద్దరు కలిసి రెండేళ్ల చదవుకున్నారు. ఓసారి ఇళ్లలోంచి పారిపోయి వివాహం కూడా చేసుకున్నారు. 

వారి మధ్య సంబంధాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఓ యువతి (19) శుక్రవారంనాడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలో చోటు చేసుకుంది. శంకర్ పల్లి ఎస్సై లక్ష్మినారాయణ అందుకు సంబంధించిన వివరాలను అందించారు. 

ఇద్దరు అమ్మాయిల్లో 19 ఏళ్ల యువతి ఖమ్మం జిల్లా పాల్వంచలో ఇంటర్ హాస్టల్లో ఉండి డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుకుంది. అదే కళాశాలలో చదువుతున్న ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన మరో యువతి (24)తో స్నేహం ఏర్పడింది. అది కాస్తా ఇరువురి మధ్య ప్రేమకు దారి తీసింది. జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. 

దాంతో వారిద్దరు నిరుడు జనవరిలో ఇళ్లలోంచి పారిపోయి వికారాబాదు గుడిలో పెళ్లి చేసుకున్నారు. మూడు నెలల పాటు అద్దె గదిలో ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు వారి ఆచూకీ కనిపెట్టారు. కౌన్సెలింగ్ చేసి ఎవరింటికివారిని పంపించారు. 

ఆ తర్వాత కూడా ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు. దీన్ని కుటుంబ సభ్యులు గుర్తించి వద్దని చెప్పారు. ఈ విషయం మీదనే కుటుంబంలో వారం రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన 19 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది.