తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టనున్నారని ప్రముఖ సినీ నటుడు ఉత్తేజ్ జోస్యం చెప్పారు. నాలుగేళ్ల పాలనలో ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ అభివృద్ది పథంలో నడిపించారని ప్రశంసించారు. అందువల్ల మళ్లీ ఆయన్నే సీఎం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందని ఉత్తేజ్ సూచించారు.

టీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి, నిర్మాత మాగంటి గోపినాథ్ కు మద్దతుగా ఉత్తేజ్ ఇవాళ ప్రచారం నిర్వహించారు. మాగంటితో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మాగంటిని గెలిపించడం ద్వారా మళ్లీ టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని ఓటర్లను కోరారు. 

ఈ సందర్భంగా ఉత్తేజ్ మాట్లాడుతూ....ప్రస్తుతం హైదరాబాద్ నుండి తమ సొంత ఊళ్లకు వెళ్లి రెండు మూడు రోజులు ఉంటున్నామంటే అదీ కేసీఆరే చలవేనని అన్నారు. లేకుంటే గ్రామాల్లో కరెంట్ కష్టాల కారణంగా అసలు ఉండలేకపోయేవారమన్నారు. ఇప్పుడు గ్రామాల్లో కూడా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఇక నిరుపేదల కోసం షాదీ ముబారక్, ఆసరా పించన్లు, రైతుల కోసం రైతు బంధు వంటి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఉత్తేజ్ గుర్తుచేశారు. 

ముఖ్యమంత్రిగా కేసీఆర్ మరో 20 ఏళ్లు కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఉత్తేజ్ తెలిపారు. జూబ్లీహిల్స్ లోని సినీ పరిశ్రమకు చెందినవారంతా మాగంటికి అండగా నిలిచి ఆయన గెలుపుకోసం పనిచేస్తున్నట్లు ఉత్తేజ్ పేర్కొన్నారు.