హైదరాబాద్: ఎన్నారై పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో తన పాత్ర లేదని టాలీవుడ్ నటుడు సూర్యప్రసాద్ అంటున్నారు. తాను జయరాంను రాకేష్ ఇంట్లో దించేసి వెళ్లామని, ఆ తర్వాత ఏం జరిగిందనేది తమకు తెలియదని ఆయన చెబుతున్నారు.

హోటల్లో ఉన్న జయరాంను రాకేష్ చెప్పడంతో కిశోర్ తో పాటు తాను కారులో తీసుకుని వెళ్లామని, రాకేష్ ఇంట్లో జయరాంను దించేసి తాము వచ్చేశామని ఆయన అంటున్నారు. కలియుగ సినిమా విడుదలకు డబ్బులు సర్దుబాటు చేస్తాడనే ఉద్దేశంతో తాను కిశోర్ ను వెంటపెట్టుకుని రాకేష్ రెడ్డి ఇంటికి వెళ్లినట్లు చెబుతున్నారు. 

హోటల్లో ఉన్న జయరాంను కిశోర్ ను వెంటపెట్టుకుని తీసుకు రావాలని రాకేష్ రెడ్డి చెప్పాడని, రాకేష్ డబ్బులు సర్దుబాటు చేస్తాడనే ఉద్దేశంతో రమ్మని చెబుతున్నాడని అనుకున్నానని ఆయన చెబుతున్నారు.

జయరాంను దించగానే వెళ్లిపోవాల్సిందిగా రాకేష్ రెడ్డి తనకు చెప్పాడని, దాంతో కిశోర్ తానూ వెనక్కి వచ్చేశామని అంటున్నాడు.  అయితే, సూర్య చెబుతున్న విషయాలపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్య విషయం తెలిసి కూడా అతను పోలీసులకు ఎందుకు చెప్పలేదనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. 

అదే సమయంలో జయరాం హత్య జరిగిన తర్వాత కూడా సూర్య రాకేష్ రెడ్డికి ఫోన్ చేశాడని పోలీసులు గుర్తించారు. దీంతో సూర్యకు హత్య విషయం తెలిసే ఉంటుందని అనుమానిస్తున్నారు.