టీవీ9 వాటాల వివాదంలో సినీనటుడు శివాజీని పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో  సీసీఎస్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం సైబరాబాద్ సైబర్ క్రైం పీఎస్‌కు శివాజీని తరలించారు. టీవీ9లో షేర్లు కొన్నట్లు ఆయన బోగస్ పత్రాలు సృష్టించారంటూ అలంద మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఇదే కేసులో విచారణకు హాజరవ్వాల్సిందిగా టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌తో పాటు శివాజీకి పోలీసులు పలు మార్లు నోటీసులు జారీ చేశారు. అయితే వీరిద్దరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

కొద్దిరోజుల తర్వాత రవిప్రకాశ్ పోలీసుల ఎదుట హాజరైనప్పటికి శివాజీ మాత్రం స్పందించలేదు. తనపై నమోదు అయిన కేసులను కొట్టివేయాల్సందిగా అతను హైకోర్టును ఆశ్రయించాడు. అయితే న్యాయస్థానం అతని క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది. 

దీంతో శివాజీపై సైబర్‌క్రైమ్ పోలీసులు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం అమెరికాకు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌‌పోర్టుకు వచ్చిన శివాజీని ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారంతో అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు.