సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. మహాకూటమి తరపున తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి సై అన్నారు.  ఇటీవల బాలకృష్ణ.. తన సొదరుడు హరికృష్ణ కుమార్తె సుహాసిని తో కూకట్ పల్లి అభ్యర్థిగా దగ్గరుండి మరీ నామినేషన్ వేయించిన సంగతి తెలిసిందే.కాగా.. సుహాసిని కోసం కూకట్ పల్లిలో ఎన్నికల ప్రచారం కూడా చేస్తానని హామీ ఇచ్చారు.

అయితే.. మొన్నటి వరకు కేవలం కూకట్ పల్లి వరకు మాత్రమే పరిమితమైన బాలకృష్ణ ప్రచారం.. ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో కూడా కొనసాగుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.  సోమవారం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ . రమణ, పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డిలు బాలకృష్ణను కలిశారు.

మహాకూటమి తరపున ప్రచారం చేయాల్సిందిగా కోరగా.. వారి కోరికను బాలయ్య మన్నించారు. నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ మధ్యలో ప్రచారానికి వస్తానని బాలకృష్ణ హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. సినీ నటులు హరికృష్ణ కుమారులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనే ప్రచారం జరుగుతోంది.