మేడ్చల్: మేడ్చల్ జిల్లా కీసర సమీపంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. మ్యాక్సీ ట్రక్ వాహనం టైరు పగలడంతో ఇద్దరు మృతి చెందగా, 9మంది గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే ఐడీఏ బొల్లారం నుంచి ఉప్పల్‌లో పని చేసేందుకు దాదాపు 11 మంది కూలీలు మ్యాక్సీట్రక్‌ వాహనంపై వెళ్తున్నారు. 

కీసర వద్దకు చేరుకునే సరికి ప్రమాదవశాత్తు ఒక్కసారిగా వెనుక టైరు పగలడంతో ట్రక్కు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కూలీలు ముత్తయ్య, చిట్టెమ్మ అనే దంపతులు మృతి చెందారు. 

వీరితోపాటు మరో 9 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులు సమీప ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.  

ఈ ప్రమాదంలో మృతి చెందిన దంపతులు, గాయపడ్డ క్షతగాత్రులు అంతా దినసరి కూలీలు కావడం విశేషం. పొట్టకూటి కోసం వెళ్తూ ప్రమాదం జరగడంతో వారంతా బోరున విలపిస్తున్నారు. ప్రతిరోజు తమతో కలిసి పనిచేసే వాళ్లని కోల్పోయామంటూ విలపిస్తన్నారు.