హైదారబాద్: ఎంటీఎంలు ఈజీ మనీ కేంద్రాలుగా మారాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారంనాడు ఏటిఎం మిషన్ నే ఎత్తుకెళ్లిన ఘటన మరిచిపోక ముందే జనగామ జిల్లాలో మరో మోసం బయటపడింది. ఎంటీఎంల్లో నగదు జమ చేసే ఉద్యోగులు నలుగురు కోటీ 39 లక్షల రూపాయలు స్వాహా చేసినట్లు వెలుగు చూసింది. 

నవంబర్ 20వ తేదీ నుంచి నాలుగు నెలలుగా నలుగురు వ్యక్తులు ఆ నగదును స్వాహా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆడీట్ రిపోర్టులో ఆ విషయాన్ని జనగామ పోలీసులు గుర్తించారు. జనగామ పరిసర ప్రాంతాల్లోని ఎంటీఎంల్లో నగదు జమ చేయడానికి ఓ కంపెనీ నలుగురు ఉద్యోగులను నియమించుకుంది.

వారు ఆలేరు, బచ్చన్నపేట వంటి ప్రాంతాల్లో నగదు జమ చేసే క్రమంలో కొత్త సొమ్మును తెలివిగా నొక్కుతూ వచ్చారు. ఆడిట్ రిపోర్టులో కోటీ 39 లక్షల రూపాయలు తేడా వచ్చినట్లు గుర్తించారు. ఎంటీఎంల్లో డిజిటల్ నెంబర్ ను చేరుస్తూనే ఆ మోసానికి ఒడిగట్టారు. వెంకటేష్, ఉపేందర్, చైతన్యకుమార్, గట్టు రాఘవ అనే నలుగురు వ్యక్తులు ఆ మోసానికి ఒడిగట్టినట్లు పోలీసులు చెప్పారు. దాదాపు 18 ఎంటీఎంల్లో చోరీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 

ఇదిలావుంటే, ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఎంటీఎంను ఎత్తుకెళ్లిన కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఏ విధమైన పురోగతి కూడా సాధించలేదు. ఈ చోరీ జరిగి ఇప్పటికే 24 గంటలు దాటింది. ఎంటీఎం మిషన్ కు వైరు చుట్టి, దాన్ని వాహనానికి కట్టారు. వాహనంతో ఆ లాగడంతో ఎంటీఎం మొత్తం ఊడి వచ్చింది. దాన్ని శివారులోకి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత మిషన్ ను పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. 

ఆ ఘటన యావత్తూ సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. అయితే, దొంగలు ముసుగులు ధరించడంతో గుర్తించడం సాధ్యం కావడం లేదు. దొంగల వాహనం కంచర్ల గ్రామం దాటి మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దాంతో దొంగలు ఇతర రాష్ట్రాలకు చెందినవారు కావచ్చునని అనుమానిస్తున్నారు. ఎంటీఎంలో ఏడు లక్షలకు పైగా నగదు ఉన్నట్లు ఎస్బీఐ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.