అత్యవసర సేవలకు ఉపయోగపడే డయల్ 100 కు ఓ ఆకతాయి ఫోన్ చేసి పోలీసులు పిలిపించుకున్నాడు. అనంతరం తనకు రెండు బీర్లు కావాలని అడిగాడు. దీంతో అతడిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. 

అర్ధ‌రాత్రి.. స‌మ‌యం సుమారు 2 గంట‌లు అవుతోంది. డయల్ 100 ద్వారా పోలీస్ కంట్రోల్ రూమ్ కు కాల్ వ‌చ్చింది. ఎవ‌రో అత్య‌వ‌స‌రంగా ఉండి కాల్ చేశార‌ని పోలీసులు భావించారు. కంట్రోల్ రూమ్ సిబ్బంది ఆ కాల్ లిఫ్ట్ చేశారు. అటు నుంచి ఓ యువ‌కుడి గొంతు వినిపిస్తోంది. ‘‘ సార్.. నేను చాలా ఇబ్బందుల్లో ఇరుక్కుపోయాను. ద‌యచేసి మీరు వ‌చ్చి నాకు సాయం చేయాలి’’ అని ప్రాదేయపడ్డాడు. కంట్రోల్ రూమ్ సిబ్బంది దగ్గరలో డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందిని అలెర్ట్ చేశారు. దీంతో ఆ స‌మీపంలో ఉన్న బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు అక్క‌డికి బ‌య‌లుదేరారు. ఎట్ట‌కేల‌కు కొన్ని నిమిషాల్లోనే అత‌డి వ‌ద్దకు చేరుకున్నారు. జ‌రిగింద‌ని ఆరా తీశారు. అత‌డు చెప్పిన స‌మాధానం విని పోలీసులు విస్తు పోయారు. వెంటనే అత‌డిని అరెస్టు చేశారు. ఇంత‌కీ అత‌డు ఏం స‌మాధానం చెప్పాడు..? ఎందుకు అత‌డిని అరెస్టు చేశారు ? ఈ విష‌యాలు తెలియాలంటే ఇది చ‌ద‌వాల్సిందే.. 

అది వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండ‌లం. ఆ మండ‌లంలో గోకఫసల్‌వాద్‌ గ్రామం ఉంది. ఆ గ్రామంలో జ‌నిగెల మ‌ధు అనే అక‌తాయి యువ‌కుడు రెండు రోజుల కింద‌ట పోలీసుల‌ను ఆట‌ప‌ట్టించాడు. రెండు రోజుల కింద‌ట అర్థ‌రాత్రి ఫుల్లుగా మ‌ద్యం సేవించాడు. అప్ప‌టికే మ‌త్తులో బాగా తూలుతున్నాడు. ఇంకా బీర్లు తాగాల‌ని అనుకున్నాడు. స‌మ‌యం రెండు గంట‌లు అవుతోంది. కానీ ఆ స‌మ‌యంలో ఎక్క‌డా బీరు దొరికే ప‌రిస్థితి లేదు. దీంతో ఏకంగా పోలీసుల‌కే కాల్ చేశాడు. మొబైల్ నుంచి 100కు డ‌య‌ల్ చేశాడు. ‘‘ సార్.. ఇక్క‌డ ఎమర్జెన్సీ ఉంది. మీరు అత్య‌వ‌స‌రంగా రావాలి. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. మీరు వెంట‌నే రావాలి’’ అని పోలీసులు భావించారు. 

హుటా హుటిన అతడు చెప్పిన చోటుకు చేరుకున్నారు. ‘‘ ఏం జ‌రిగింది బాబు. ఏంటి సమస్య’’ అని పోలీసులు అడిగారు. అప్పుడు తీరిగ్గా ఆ యువకుడు ‘‘ సార్ నాకు రెండు బీర్లు కావాలి’’ అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో పోలీసులు ఖంగుతిన్నారు. అత‌డి ప‌రిస్థితి పోలీసుల‌కు అర్థం అయ్యింది. వెంట‌నే అత‌డిని అరెస్టు చేసి పోలీసు స్టేష‌న్ కు త‌ర‌లించారు. పోలీసుల స‌మ‌యాన్ని వృథా చేశాడ‌నే కార‌ణంతో కేసు న‌మోదు చేశారు.