పాపం...ఏం కష్టం వచ్చిందో ఏమోగానీ ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో తల్లి ప్రాణాలు కోల్పోగా ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. 

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఓ వివాహిత తన ఇద్దరు చిన్నారులతో కలిసి బావిలో దూకి  ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించింది. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే బావిలోకి దూకి ముగ్గురిని బయటకు తీశారు. అప్పటికే సదరు మహిళ మృతిచెందగా ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. 

కొన ఊపిరితో  కొట్టుమిట్టాడుతున్న చిన్నారులను చికిత్స నిమిత్తం తాండూరులోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలిపారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమై ఉంటాయని అనుమానిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు తెలిసిన తర్వాత ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.