Asianet News TeluguAsianet News Telugu

చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అక్కడ కేసీఆర్‌ని, ఇక్కడ జగన్‌ని తగలబెట్టేసింది: ఎడిటర్స్ కామెంట్

కేటీఆర్ మాకు అహం లేదు అది ఆత్మవిశ్వాసం అంటూ మాట్లాడింది నిజమే. కాకుంటే.. తెలంగాణ ప్రజలు అహం అనుకున్నారు. అలా అహం అనుకోవడం వల్లే బీఆర్ఎస్ నాయకులు తమకు దూరమయ్యారని భావించారు. కాంగ్రెస్‌కు పట్టంగట్టారు. ఇప్పటికీ బీఆర్ఎస్ ఆత్మవిశ్వాసం అనే అనుకుంటే జరిగే నష్టం ప్రజలకు కాదు.

A small communication gap has dethroned KCR and Jagan
Author
First Published Jul 10, 2024, 2:57 PM IST | Last Updated Jul 10, 2024, 3:09 PM IST

తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు. ఇదీ 2014లో సీన్. కానీ ఇద్దరికీ పొసగలేదు. ఓటుకు నోటు కేసు, ఇతర రాజకీయ కారణాలతో చంద్రబాబు తెలంగాణ వైపు చూసే సాహసం కూడా చేయలేని పరిస్థితి. చివరకు తెలంగాణలో టీడీపీని దాదాపు క్లోజ్ చేయాల్సిన పరిస్థితి. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్మోహన్ రెడ్డి. ఇదీ 2019 తర్వాత సీన్. ఇరు పక్షాలూ స్నేహపూర్వకంగా మెలగడంతో పెద్దగా అటు బీఆర్ఎస్‌కి, ఇటువైపు వైసీపీకి ఇబ్బంది లేదు.

ఇప్పుడు సీన్ చాలా రివర్స్. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. వీరిద్దరిలోనూ స్నేహపూర్వక వాతావరణం ఉండటం.. విభజన సమ్యలపై దృష్టిపెట్టడం ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్‌కి ఏమాత్రమూ నచ్చని అంశంగా కనిపిస్తోంది. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఎం హోదాలో హైదరాబాద్‌ వెళ్లి రేవంత్ రెడ్డిని కలుస్తోంటే.. బీఆర్ఎస్‌ నేతలు కాదు.. కాదు అంటూనే ఎక్కడో ఉలిక్కి పడుతున్నారు.  మరోవైపు చంద్రబాబు నాయుడు మొన్న ఎన్టీఆర్‌ భవన్‌లో తెలుగుదేశం శ్రేణులతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ గడ్డపై పుట్టిన తెలుగుదేశం పార్టీకి పునర్‌ వైభవం వస్తుందని.. యువతకు పార్టీ పగ్గాలు అప్పగిస్తామని ప్రకటించారు. తెలుగుదేశం శ్రేణులందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇది ఒకరకంగా బీఆర్‌ఎస్‌కు ఇబ్బందికరమైన ప్రకటనే అని చెప్పాలి.

A small communication gap has dethroned KCR and Jagan

చంద్రబాబు అంత ఈజీగా వదిలిపెడతాడా?

చంద్రబాబు నాయుడు రాజకీయంలో సుదీర్ఘ అనుభవం కలిగిన చాణక్యుడనే పేరుంది.  ఇప్పుడు అటు తెలంగాణలో రేవంత్ రెడ్డితో, ఇటు కేంద్రంలో బీజేపీతో సఖ్యత కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో సాధించారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ఇరికించి.. పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అయినా సరే.. హైదరాబాద్‌లో ఉండనివ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేసిన బీఆర్ఎస్‌ను చంద్రబాబు అంత ఈజీగా వదులుతారా..? పైగా తెలంగాణలో టీడీపీని పునరుద్ధరిస్తామనీ అంటుండె.. దీంతో ఎక్కడో బీఆర్ఎస్‌కి సెగ తగులుతోంది. అందుకే జగన్, కేసీఆర్ కలిసినపుడు ఏ వివాదమూ లేదు. కానీ రేవంత్, చంద్రబాబు కలిస్తే మాత్రం రకరకాల అంశాలను తెరపైకి తెస్తున్నారు. ఇంకాస్త వివరంగా.. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు విజయాన్ని అటు కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నట్లు కనిపిస్తోంది. దాదాపు వైసీపీని మట్టి కరిపించినా.. జగన్ సూపర్, 11 సీట్లు వచ్చినా మావోడు మామూలోడు కాదంటూ వాఖ్యలు చేస్తున్నారు కానీ.. టీడీపీ విజయాన్ని అభినందించలేకపోతున్నారు. చివరకు కూటమి విజయం పవన్ వల్లే దక్కిందని అంటున్నారు కానీ.. చంద్రబాబుకు క్రెడిట్ ఇవ్వడానికి వాళ్ల మనసు అంగీకరించడం లేదు.

అయితే అటు కేసీఆర్, ఇటు జగన్ ఓటమికి కామన్‌గా కారణం ఒక్కటే. పార్టీ అధినాయకత్వానికి, ప్రజలకు మధ్య గ్యాప్ పెరగడం వల్ల ఇద్దరూ ఓడిపోయారు. ఇది రెండు పార్టీలూ అంగీకరించాయి కూడా. మొన్న ఓ ప్రెస్ మీట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. అహం వల్ల ఓడిపోయాం అని దుష్ప్రచారం చేస్తున్నారు.. మేం అహం వల్ల ఓడిపోలేదు. అది అహం కాదు.. ఆత్మవిశ్వాసమని అన్నారు.

కేటీఆర్ మాకు అహం లేదు అది ఆత్మవిశ్వాసం అంటూ మాట్లాడింది నిజమే. కాకుంటే.. తెలంగాణ ప్రజలు అహం అనుకున్నారు. అలా అహం అనుకోవడం వల్లే బీఆర్ఎస్ నాయకులు తమకు దూరమయ్యారని భావించారు. కాంగ్రెస్‌కు పట్టంగట్టారు. ఇప్పటికీ బీఆర్ఎస్ ఆత్మవిశ్వాసం అనే అనుకుంటే జరిగే నష్టం ప్రజలకు కాదు. బీఆర్ఎస్‌కే. ఏపీలోనూ అదే జరిగింది. జగన్, వైసీపీ నేతలు ఆత్మవిశ్వసం అనుకుంటే ప్రజలు దాన్ని అహం అని ఫీలయ్యారు. ఫలితం చంద్రబాబు, పవన్ కూటమికి కలిసొచ్చింది. లేకుంటే తెలంగాణలో అన్ని రంగాల్లోనూ టాప్‌లో నిలబెట్టిన బీఆర్ఎస్, అవ్వాతాతలు మొదలుకుని అక్కచెల్లెమ్మల వరకూ అందరికీ అన్నీ చేసిన వైసీపీ ఓడిపోవడం ఏంటి. కారణం ఒక్కటే.. అటు కేసీఆర్, బీఆర్‌ఎస్ నేతల తీరు, ఇటు జగన్, వైసీపీ నేతల తీరుపై ప్రజలకు ఎక్కడో మండింది. దీంతో ఇరు పార్టీలనూ అధికారంలో లేకుండా దారుణంగా దెబ్బగొట్టారు. 

రెండుసార్లు గెలిపించిందీ ప్రజలే కదా...

మా నీళ్లు, నిధులు, నియామకాలు మాకే కావాలన్న నినాదంతో తెలంగాణ సమాజం కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంది. సుదీర్ఘ పోరాటం అనంతరం ఆవిర్భవించిన తెలంగాణలో ప్రజలు ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని గుర్తించారు. ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన కాంగ్రెస్‌ను కాదని... టీఆర్‌ఎస్‌ (ఇప్పుడు బీఆర్‌ఎస్‌)కు అధికారమిచ్చారు. 2014లో రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను మెజారిటీ స్థానాల్లో గెలిపించుకున్నారు. మొత్తం 119లో 63 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్‌ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి 22 మంది, తెలుగుదేశం పార్టీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా... ఈ రెండు పార్టీల్లో మెజారిటీ సభ్యులను మూకుమ్మడిగా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేర్చుకున్నారు. దీనికి పార్టీ ఫిరాయింపు అని కాకుండా, విలీనం అని పేరుపెట్టారు. 

రెండోసారి 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు. రాష్ట్రంలో రెండోసారి జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే కేసీఆర్‌ అవకాశమిచ్చారు. అప్పటికి కేసీఆర్‌ ప్రారంభించిన ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, ఇతర పథకాలు పెండింగ్‌లో ఉండటంతో ప్రజలు మరోసారి టీఆర్‌ఎస్‌కే అధికారమిచ్చారు. 88 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రెండోసారి అసెంబ్లీకి ఎన్నికవగా..  19 స్థానాలకు కాంగ్రెస్‌ పరిమితం అయ్యింది. 
అయితే, ఇక్కడే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలకు దూరం పెరిగింది.. 2014 నాటికి, 2018 తర్వాత నాటికి బీఆర్‌ఎస్‌ నేతల మాటల్లో తేడా వచ్చింది. ప్రతిపక్షాలపైనే కాకుండా ప్రజలను అధికార పార్టీ దబాయించింది. ప్రశ్నించిన వారిని వెంటాడటం, ఇబ్బందులకు గురిచేయడం ప్రారంభించింది. తామే సుప్రీం అన్నట్లు, తెలంగాణ తమ సామ్రాజ్యం అన్నట్లు బీఆర్‌ఎస్‌ అధినేతలు మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధిలో మిగతా రాష్ట్రాల కంటే మిన్నగా పరిపాలన సాగించినప్పటికీ అహంకార ధోరణి ప్రదర్శించడం ప్రజలను ఆగ్రహానికి గురిచేసింది. ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచార సభల్లోనూ కేసీఆర్, ఇతర నాయకులు నేరుగా ప్రజలపై అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొట్టాయి. ఇలా అహంకార పూరిత ధోరణి కారణంగా కేసీఆర్‌ అధికారానికి దూరమయ్యారు. తొమ్మిదేళ్లు తెలంగాణను పాలించిన పార్టీ 38 సీట్లతో ప్రతిపక్ష స్థానానికి పడిపోయింది. అయితే ఓడిపోయాక కూడా తగ్గేదే లేదన్నట్లు కేసీఆర్‌, కేటీఆర్‌ ధోరణి ఉండటంతో గెలిచిన 38 మంది ఎమ్మెల్యేలు కూడా మెల్లగా దూరం అవుతున్నారు. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు, ఎంపీలు బీఆర్‌ఎస్‌ నుంచి జంప్‌ చేసి కాంగ్రెస్‌ గూటికి చేరారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios