హైదరాబాద్‌: హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారిపై లైంగిక దాడి ఘటనను మరవక ముందే హైదరాబాద్‌లో మరో క్రూరమైన సంఘటన చోటుచేసుకుంది. రామంతపూర్‌లో తొమ్మిదేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. 

నెత్తురోడుతున్న బాలికను ఆమె తల్లిదండ్రులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని మేస్త్రీ పనిచేసే లక్ష్మణ్‌గా గుర్తించారు. బాధితురాలి తల్లిదండ్రులు ఖమ్మం నుంచి నాలుగు నెలల క్రితం రామంతపూర్‌లోని టీవీ కాలనీకి వలస వచ్చి కూలీ పనిచేసుకుంటూ ఒక గుడిసెలో నివసిస్తున్నారు. 

గుడిసె ప్రక్కనే ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్కడ మేస్ట్రీ పని చేసే లక్ష్మణ్(23), గుడిసెలో ఎవరు లేని సమయం చూసి బాలికపై అత్యాచారం చేశాడు. తీవ్ర రక్త స్రావంతో ఉన్న బాలికను చూసిన స్థానికులు లక్ష్మణ్‌ను పట్టుకుని చితకబాదారు. 

స్థానికుల దాడి నుంచి తప్పించుకున్న నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుని కోసం గాలింపు చేపట్టారు.