భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి నదిలో ఓ ఆశ్రమం చిక్కుకుంది. అందులో చిక్కుకున్న ఏడుగురు స్వామీజీలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. 

నిజామాబాద్: రాష్ట్రంలోనే కాదు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. నదీ ఉధృతి అంతకంతకు పెరుగుతూ జనవాసాలపైకి నీరు పోటెత్తుతోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా గోదావరి ఒడ్డున గల ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఇలా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలంలోని ఓ ఆశ్రయం వరదనీటిలో చిక్కుకుంది. దీంతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో ఆశ్రమంలో చిక్కుకున్నవారు సురక్షితంగా బయటపడ్డారు. 

వీడియో

వివరాల్లోకి వెళితే... మంత్రి ప్రశాంత్ రెడ్డి సొంత నియోజకవర్గం బాల్కొండలోని తడ్ పాకల్, సావెల్ గ్రామాల సమీపంలో గోదావరి ఒడ్డున ఓ ఆశ్రయం వుంది. అయితే రాత్రికి రాత్రి గోదావరి నదిలో నీటిప్రవాహం పెరగడంతో ఆశ్రమానికి రాకపోకలు నిలిచిపోయాయి. అందులో వున్న ఏడుగురు అక్కడే బయటకు రాలేక అక్కడే చిక్కుకున్నారు. 

read more గోదావరిలో చిక్కుకున్న 40మంది... స్వయంగా రంగంలోకి దిగి కాపాడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే (వీడియో)

అయితే ఎప్పటికప్పుడు గోదావరి వరద ఉధృతిని, లోతట్టు ప్రాంతాల పరిస్థితులపై అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఆశ్రమంలో చిక్కుకున్న వారి గురించి తెలిసింది. దీంతో వెంటనే ఆశ్రమంలో చిక్కుకున్న వారితో మాట్లాడి ధైర్యం చెప్పిన మంత్రి ప్రభుత్వ యంత్రంగాన్ని అప్రమత్తం చేశారు. రాత్రంతా ప్రభుత్వ ఉన్నతాధికారులతో మానిటరింగ్ చేస్తూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించి ఆశ్రమంలో చిక్కుకున్న వారిని క్షేమంగా కాపాడగలిగారు.

ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇవాళ(శుక్రవారం) తెల్లవారు జామున ఆశ్రమంలో చిక్కుకున్నవారిని బయటకు తీసాయి. మంత్రి ఆదేశాల మేరకు ఆర్డీవో శ్రీనివాసులు ఈ ఆపరేషన్ దగ్గరుండి పర్యవేక్షించారు. తమను క్షేమంగా బయటకు తీసుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ యంత్రంగానికి కృతజ్ఞతలు తెలిపారు ఆశ్రమ స్వాములు. వర్షాలు, వరదల కారణంగా ఎవ్వరికి, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాకుండా పూర్తి అలెర్ట్ గా ఉండాలని అధికారులను ఆదేశించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.