ఓ వైపు కరోనా కలకలం రేపుతుంటే మరోవైపు పార్టీలు, రేవ్ పార్టీలంటూ జనం చిందులు వేస్తున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా కీసరలో రేవ్‌ పార్టీ కలకలం రేపింది. ఆదివారం రాత్రి ఓ ఫెర్టిలైజర్‌ వ్యాపారి తిమ్మాయిపల్లిలోని ఫారెస్ట్ రిడ్జ్ రిసార్ట్‌లో సన్నిహితుల కోసం ఆరుగురు అమ్మాయిలతో రేవ్‌ పార్టీ ఏర్పాటు చేశాడు. 

ఈ పార్టీలో సిద్దిపేట, నల్గొండ, వరంగల్, గజ్వేల్‌కు చెందిన ఫెర్టిలైజర్ డీలర్‌లు ఇందులో పాల్గొన్నారు. విందు, మందు అమ్మాయిలతో చిందులతో వీరంతా రచ్చరచ్చ చేశారు. అయితే ఈ విషయం ఎలాగో పోలీసులకు తెలిసింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఆరుగురు యువతుల్ని, 10 మంది యువకుల్ని అరెస్ట్‌ చేశారు. 

రేవ్ పార్టీ ఏర్పాటు చేసిన బెస్ట్‌ క్రాఫ్ట్స్ సీడ్స్ కంపెనీ మేనేజర్‌ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి సెల్‌ఫోన్లు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.