తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,801 మంది కొవిడ్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వైరస్‌ బారినపడిన 7,430 మంది కోలుకున్నారు. వైరస్ వల్ల 32 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,06,988కి చేరుకున్నాయి.

ఇఫ్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య  4,44,049కు చేరుకోగా.. ఇవాళ్టీ వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,803కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 75,289 మంది శాంపిళ్లను పరీక్షించారు. ప్రస్తుతం తెలంగాణలో కొవిడ్‌ మరణాలు రేటు 0.55 శాతంగా ఉండగా.. రికవరీ శాతం 87.58గా ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

Also Read:తెలంగాణలో లాక్ డౌన్: వీటికి మినహాయింపులు, పెళ్లిళ్లూ అంత్యక్రియలపై ఆంక్షలు

కాగా, తెలంగాణలో కరోనా వైరస్ కట్టడి నిమిత్తం పది రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మే 12వ తేదీ నుంచి 22 వరకూ ఈ లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. లాక్‌డౌన్ విధించడంతో ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకే ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. అంతర్రాష్ట్ర సర్వీసులు నడపమని ఆర్టీసీ ప్రకటించింది. వ్యవసాయ రంగానికి లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. అలాగే ఈ నెల 20 కేబినెట్ మరోసారి సమావేశమై లాక్‌డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది.