యజమానిగా తన కింద పనిచేసే వాళ్లను ఆదరించాల్సింది పోయి.. ముగ్గురు బాలికల జీవితాలను నాశనం చేశాడో కామాంధుడు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన లింగంపల్లి కిషన్ తన ఇటుక బట్టీలలో ఒడిశాకు చెందిన కూలీలను వినియోగించుకునేవాడు.

కిషన్ 2014 మార్చి 16 రాత్రి ఒక కూలీ ఇంట్లోకి వెళ్లి 16 ఏళ్ల బాలికను బలవంతంగా అపహరించుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా నెలరోజుల్లోపే ఏప్రిల్ 14 రాత్రి మరో ఇద్దరు బాలికలపైనా కిషన్ అత్యాచారం చేశాడు.

ఈ దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించినప్పటికీ వీరంతా ఒడిశాకు చెందిన వారు కావడంతో భయపడ్డారు. చివరికి 2014 ఏప్రిల్ 19న చొప్పదండి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితుడు కిషన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన కరీంనగర్‌ మొదటి అదనపు సెషన్స్ కోర్టు కిషన్‌ను దోషిగా నిర్ధారించింది. నిందితుడికి జీవితఖైదుతో పాటు బాలికలకు ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించారు. కాగా పోక్సో చట్టం కింద తొలి తీర్పు ఇదే కావడం గమనార్హం.