కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. తండ్రి నడుపుతున్న ట్రాక్టర్ కింద పడి మూడేళ్ల చిన్నారి మరణించింది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ మండలం చెర్లబూత్కూర్ గ్రామానికి చెందిన జక్కుప్రసాద్ వ్యవసాయం చేస్తుంటాడు.

మంగళవారం మధ్యాహ్నం అతని కుమార్తె రితికకు తల్లి అన్నం తినిపిస్తుండగా.. ఇంటి ముందు ఆడుకుంటోంది. అన్నం అయిపోవడంతో తల్లి ఇంట్లోకి వెళ్లింది.. సరిగ్గా ఆ సమయంలో ప్రసాద్ ట్రాక్టర్‌ను వెనక్కి తీయటాన్ని గమనించిన రితిక తండ్రి దగ్గరకు పరిగెత్తింది.

చిన్నారి రాకను గమనించకుండా అలాగే వెనక్కిపోనించడంతో రితిక ట్రాక్టర్ చక్రాల కిందపడి నలిగిపోయింది. పాప అరుపులు విన్న ప్రసాద్ ట్రాక్టర్‌ను ఆపి చూడగా.. రక్తపు మడుగులో తన కూతురు కనిపించింది.

ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చిన్నారి ప్రాణాలు విడిచింది. తమ గారాలపట్టి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.