రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి అనంతపురం వెళుతున్న ఓ కారు షాద్‌నగర్ సమీపంలో మరో కారును ఓవర్‌టేక్ చేయబోయి డివైడర్‌ను ఢీకొట్టింది.

అయితే ఆ సమయంలో మితిమిరిన వేగంలో ఉండటంతో పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గుర్తించిన వాహనదారులు 108 సాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం వారి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మరోవైపు ప్రమాద సమయాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి మాట్లాడుతూ.. కారు పల్టీలు కొడుతుండగా ఓ యువకుడి మృతదేహం సుమారు 20 అడుగుల ఎత్తు ఎగిరి రోడ్డు పక్కన ఉన్న పొలంలో పడిందని తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. వీరంతా స్నేహితుడి సోదరుడి వివాహానికి హాజరయ్యేందుకు మారుతీ ఎర్టికా కారులో అనంతపురం బయలుదేరినట్లుగా తెలుస్తోంది. వీరి మరణవార్తతో మృతుల కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది.