హైదరాబాద్: తెలంగాణలో సగం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 113 కుటుంబాల నుంచే నమోదయ్యాయి. రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రానికి మొత్తం 983 కేసులు నమోదైన విషయం తెలిసిందే.  గ్రేటర్ హైదరాబాదులో మొత్తం 485 కేసులు నమోదయ్యాయి. వాటిలో 268 కేసులు 44 కుటుంబాల్లో నమోదైనవి కావడం విశేషం.

ఆ కుటుంబాల్లో ముందుగానే కొందరికి కరోనా లక్షణాలు కనిపించినా దాచి పెట్టారు. సమాచారం వైద్య ఆరోగ్య శాఖకు ఇవ్వలేదు. దీంతో వారి కటుంబ సభ్యులకు కూడా కరోనా వైరస్ సోకింది. హైదరాబాదు తర్వాత అత్యధిక కేసులు సూర్యాపేట జిల్లాలో నమోదయ్యాయి. ఆ జిల్లాలో శుక్రవారంనాటికి 83 కేసులు నమోదయ్యాయి. అవన్నీ కేవలం 25 కుటుంబాల నుంచి వచ్చినవే.సూర్యాపేట జిల్లాలో మర్కజ్ లింక్ తో ఒక్కరికి వైరస్ సోకగా ఆ తర్వాత అతడి నుంచి వేగంగా వ్యాప్తి చెందుతూ వచ్చింది. 

జోగులాంబ- గద్వాల జిల్లాలో మొత్తం 49 కేసులు నమోదయ్యాయి. అందులో 45 కేసులు 30 కుటుంబాల నుంచి వచ్చినవే. శుక్రవారం ఈ జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. వికారాబాద్ జిల్లాలో నమోదైన కేసులన్నీ 14 కుటుంబాల నుంచి వచ్చినవే.  ఈ జిల్లాలో ఇప్పటి వరకు 38 కేసులు నమోదయ్యాయి. ఆ రకంగా రాష్ట్రంలోని సగం కేసులు 113 కేసుల నుంచి వచ్చినవే.  కాగా, గత మూడు రోజులుగా రాష్ట్రంలో కేసుల తీవ్రత తగ్గుతూ వస్తోంది.

కుటుంబాల్లో ఇలా వైరస్ కేసులు నమోదయ్యాయి....

హైదరాబాదు 44 కుటుంబాల నుంచి 268 మందికి కరోనా వైరస్
సూర్యాపేట జిల్లాలో 25 కటుంబాల నుంచి 83 మందికి కరోనా వైరస్
గద్వాల జిల్లాలో 30 కుటుంబాల నుంచి 45 మందికి కరోనా వైరస్
వికారాబాద్ జిల్లాలో 14 కుటుంబాల నుంచి 38 మందికి కరోనా వైరస్