లోకో‌పైలట్ అప్రమత్తతో ఓ యువతి ప్రాణాలతో బయటపడింది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌కు చెందిన ఓ 20 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా సోమవారం ఉదయం భరత్‌నగర్ రైల్వే స్టేషన్‌కు కొద్దిదూరంలో నిలబడింది.

అప్పుడు లింగంపల్లి వైపుగా వెళుతున్న ఎంఎంటీఎస్ స్టేషన్ నుంచి కొంచెం దూరం కదిలింది. వెంటనే సదరు యువతి పట్టాలపై ఎంఎంటీఎస్ వైపుకు పరిగెత్తుకొచ్చింది. దీనిని గమనించిన ట్రైన్ లోకోపైలట్‌కు ఆమె ఆలోచన అర్థమైపోయింది.

వెంటనే బ్రేకులు వేశాడు.. నెమ్మదిగా వెళ్తుండటం వల్ల ఆమెను స్వల్పంగా ఢీకొని ఎంఎంటీఎస్ ఆగిపోయింది. దీనిపై లోకో‌పైలట్ పోలీసులకు సమాచారమివ్వడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. స్వల్పగాయాలు కావడంతో యువతికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందించారు. మరో ఘటనలో లక్డీకపూల్ స్టేషన్ వద్ద కదులుతున్న రైలులోంచి దూకి మహబూబ్‌నగర్‌కు చెందిన సాంబశివుడు అనే 67 ఏళ్ల వృద్ధుడు మరణించాడు.