హైదరాబాద్ లో ఓ బాలిక అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్, హయత్ నగర్, కుంట్లూర్ లో ఫిబ్రవరి 18న ఈ ఘటన జరిగింది. ఆ అమ్మాయి అదే గ్రామానికి చెందిన ఓ రియల్‌ వ్యాపారి వెంట వెడుతున్నట్టుగా ఉత్తరం రాసిపెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. 

దీంతో బాలిక కుటుంబ సభ్యులు ఆ రోజే హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెడితే.. కుంట్లూరులో ఉండే పద్దెనిమిదేళ్ల అమ్మాయి, హయత్ నగర్ లో ఓ జూనియర్ కాలేజీలో ఇంటర్ మీడియట్ చదువుతోంది. 

అదే గ్రామానికి చెందిన పి. యాదయ్య కారులో ఎక్కి వెళ్లినట్లు స్థానికులు చెప్పారని కుటుంబ సభ్యలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతవరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో భయమేస్తోందని వారు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి ఆచూకీ కోసం ప్రత్యేక సిబ్బందిని వివిధ ప్రాంతాలకు పంపినట్లు సీఐ సురేందర్ తెలిపారు.