తమపై దాడి చేయించాడని ఓ ఆటోడ్రైవర్ అతని మిత్రుడు కలిసి ఓ బాలుడిని దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. అల్‌జాబ్రి కాలనీకి చెందిన యూసుఫ్ కుమారుడు మొహ్మద్ మూసా పహాడీషరీఫ్ రాజీవ్ గాంధీ నగర్‌కు చెందిన షేక్ ఒవైసీ అనే ఆటోడ్రైవర్ వద్ద క్లీనర్‌గా పనిచేసేవాడు.

అయితే ఓవైసీ చిన్న చిన్ని విషయాలకే తమను తిడుతూ... కొడుతున్నాడని మొహ్మద్ మూసా అతని దగ్గర పని మానేసి మరో చోట క్లీనర్‌గా చేరాడు.  ఈ క్రమంలో కొత్త ఆటో యజమానికి, షేక్ ఒవైసీకి మధ్య ఇటీవల గొడవలు జరిగాయి.

ఆ గొడవలకు మొహ్మద్‌మూసా చెప్పుడు మాటలే కారణమని భావించిన షేక్ ఓవైసీ భావించాడు. షాహిన్‌నగర్‌లో నివాసముండే జాఫర్ తన మిత్రుడిని వెంటబెట్టుకుని బుధవారం రాత్రి అల్‌జాబ్రీ కాలనీలోని మూసా ఇంటికి వెళ్లాడు.

నీ కొడుకుతో మాట్లాడాలని మూసా తల్లిదండ్రులకు చెప్పి.. అతడిని తీసుకుని సమీపంలోని సుల్తాన్‌పూర్‌ మార్గంలో నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ముగ్గురు వాగ్వాదానికి దిగారు.

ఆగ్రహానికి గురైన షేక్ ఓవైసీ, జాఫర్‌లు కలిసి మూస తలపై బలంగా మోదారు. బాలుడు తీవ్రంగా గాయపడి.. రక్తస్రావం కావడంతో నిందితులిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు.

రాత్రి పన్నెండు గంటల సమయంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. మూసా కనిపించాడు. వెంటనే పోలీసులు బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు.