Asianet News TeluguAsianet News Telugu

మారని స్థితి: 16 ఏట అడుగుపెట్టిన వీణా.. వాణీ

అవిభక్త కవలలు వీణా.. వాణీలు ఇంకా  నరకం నుండి  బయటపడలేదు. 

16th birthday: no changes in conjoined twins veena vani life
Author
Hyderabad, First Published Oct 16, 2018, 12:46 PM IST

వరంగల్:  అవిభక్త కవలలు వీణా.. వాణీలు ఇంకా  నరకం నుండి  బయటపడలేదు. వీణా.. వాణీలు పుట్టుకతోనే అతుక్కొని పుట్టారు.కానీ, ఇంతవరకు  వారికి శస్త్రచికిత్స జరగలేదు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని  దంతాలపల్లి మండలం భీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన మారగాని మురళి, నాగలక్ష్మి దంపతులకు రెండో సంతానంగా వీణా.. వాణీలు  జన్మించారు.  ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వీణా.. వాణీలకు  నాగలక్ష్మి జన్మనిచ్చింది.

పుట్టిన తర్వాత వీరిని విడదీసేందుకు గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ నాయుడమ్మ పర్యవేక్షణలో ఉన్నారు. అనేక క్లిష్టమైన  కేసుల్లో విజయవంతమైన శస్త్రచికిత్సలు చేసిన నాయుడమ్మ ఈ పిల్లలను విడదీయలేకపోయారు. 

దీంతో 2006లో హైద్రాబాద్‌ నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.  వీణా.. వాణీలకు శస్త్రచికిత్స చేసేందుకు గాను  ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రికి  తీసుకెళ్లారు. కొన్ని రోజుల పాటు అక్కడే వారిని ఉంచారు.

కానీ, వీరికి శస్త్రచికిత్స నిర్వహించలేదు.  వీణా.. వాణీలను శస్త్రచికిత్స చేసి విడదీస్తే ప్రాణాలకే ప్రమాదమని  బ్రీచ్ కాండీ వైద్యులు తేల్చి చెప్పడంతో  తిరిగి వీణా..వాణీలను హైద్రాబాద్‌కు తీసుకొచ్చారు.

వీణా.. వాణీలకు శస్త్రచికిత్స  చేసేందుకు  అస్ట్రేలియా, సింగపూర్, లండన్ నుండి వైద్యులు ముందుకు వచ్చారు. కానీ,  పలు కారణాలతో శస్త్రచికిత్స చేయకుండానే  వెనుతిరగాల్సి వచ్చింది. 

గత ఏడాది వీణా.. వాణీలకు శస్త్ర చికిత్స కోసం కొందరు వైద్యులు ముందుకు వచ్చారు. ఎయిమ్స్  వైద్య బృందం కూడ కొన్ని పరీక్షలను నిర్వహించింది. అయితే శస్త్రచికిత్సలు మాత్రం జరగలేదు. 

నీలోఫర్ ఆసుపత్రిలోనే ఉంటున్న వీణా.. వాణీలను  గత ఏడాది  రాష్ట్ర ప్రభుత్వం యూసుఫ్‌గూడలోని స్టేట్ హోమ్‌కు తరలించారు. వీణా.. వాణీలు  ప్రస్తుతం 8వ, తరగతి చదువుతున్నారు. స్టేట్ హోం‌లోనే  మంగళవారం నాడు  పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. 

పుట్టినరోజు సందర్భంగా వీణా.. వాణీల తల్లిదండ్రులు యూసుఫ్ గూడకు వచ్చారు. తల్లిదండ్రుల సమక్షంలో పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు.వీణా.. వాణీలు పుట్టిన నాటి నుండి  తల్లిదండ్రులకు దూరంగానే ఉంటున్నారు. ఎక్కువ కాలం  నీలోఫర్ ఆసుపత్రిలోనే పిల్లలు గడిపారు. నీలోఫర్  తర్వాత ఇతర ఆసుపత్రుల్లోనే గడిపారు. తల్లిదండ్రుల వద్ద  ఉన్న కాలం కూడ అతి తక్కువ కాలమే.

లండన్ డాక్టర్లు వీణా.. వాణీలకు  శస్త్రచికిత్స చేస్తే  80 శాతం బతికే అవకాశం ఉంటుందని  వైద్యులు చెప్పారని  తల్లిదండ్రులు  చెప్పారు.వీణా.. వాణీలు ఇవాళ్టికి 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. సుధీర్ఘకాలం పాటు  పిల్లలకు  దూరమైన ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరౌతున్నారు.

శస్త్ర చికిత్స చేసే అవకాశం లేకపోతే కనీసం తమను పిల్లలకు దగ్గరగా ఉండేలా ఉపాధి కల్పించాలని  తండ్రి మురళి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎంత కాలం పాటు  పిల్లలకు  దూరంగా ఉంటామని ఆ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.వీణా.. వాణీలకు శస్త్రచికిత్స చేసేందుకు  ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios