యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో 16 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఆ 16 మంది బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

పాజిటివ్‌ వచ్చిన వారికి సంబంధించి 76 మంది ప్రైమరీ కాంటాక్టులను గుర్తించామని అధికారులు వెల్లడించారు. దీనితో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

యూకే నుంచి వచ్చి కరోనా పాజిటివ్‌‌గా తేలిన వారిలో హైదరాబాద్ 4‌, మేడ్చల్ 4, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఒకరికి చొప్పున పాజిటివ్‌గా తేలింది.

కాగా, ఇప్పటి వరకు యూకే నుంచి వచ్చిన 1,200 మందిలో 926 మందిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గుర్తించిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించామని.. జీనోమ్‌ సీక్వెన్స్‌ కోసం నమూనాలను సీసీఎంబీకి పంపించినట్లు వైద్యాధికారులు తెలిపారు.

కాగా, డిసెంబర్ 9 తరువాత రాష్ట్రానికి నేరుగా బ్రిటన్ నుంచి వచ్చిన వారు లేదా బ్రిటన్ మీదుగా ప్రయాణించి వచ్చిన వారు వారి వివరాలను 040-24651119 నంబర్ కి ఫోన్ చేసి లేదా 9154170960 నంబర్ కి వాట్స్ ఆప్ ద్వారా అందిచాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.