తెలంగాణలో కొత్తగా 13 కరోనా పాజిటివ్ కేసులు: 983కు చేరిన సంఖ్య
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 13 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 983కు చేరుకుంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 13 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య రాష్ట్రంలో 983కు చేరుకుంది.
ఇప్పటి వరకు 291 మంది కోలుకుని ఆస్పత్రు నుంచి డిశ్చార్జీ అయ్యారు. యాక్టివ్ కేసులు 663 ఉన్నట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ఇప్పటి వరకు 25 మంది మరణించినట్లు ఆయన తెలిపారు.
వికారాబాద్, గద్వాల, సూర్యాపేటల్లో ప్రత్యేక దృష్టి సారించి, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ మూడు జిల్లాలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. కొద్ది మంది శాడిస్టులు ఉంటారని, వారు పుకార్లు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఎక్కడిదో ఫొటో తెచ్చి పోస్టు పెడుతున్నారని ఆయన అన్నారు. దానిపై బాధ్యతాయుతమైన వ్యక్తులు స్పందించడం దురదృష్టకరమని ఆయన అన్నారు. సైకోలు, శాడిస్టులు పంపే ఫొటోలను చూపించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.
సైకోలు, శాడిస్టులపై ఆధారపడి మాట్లాడడం బాధ్యతాయుతమైన వ్యక్తులకు తగదని ఆయన అన్నారు. కోరనా రోగులకు ఇస్తున్న ఆహార పదార్థాల వివరాలను ఆయన వివరించారు. అక్కడికి బిర్యానీ తెచ్చియ్యలేమని ఆయన అన్నారు. ప్రొటోకాల్ ను పక్కన పెట్టి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
663 మందితో నర్సులు, వైద్యులు పనిచేస్తుంటే వారి ఆత్మస్థయిర్యం దెబ్బ తినే విధంగా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. ఆహార పదార్థాలు, టాయిలెట్లు బాగాలేవని డిశ్చార్జీ అయినవారు చెప్పారని ఆయన అన్నారు. గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయినవాళ్లే తమను చూసిన తీరును ప్రశంసించారని ఆయన అన్నారు. సులభ్ కాంప్లెక్స్ లో పనిచేసేవారిని తాను మాట్లాడి పంపించానని ఆయన చెప్పారు. డాక్టర్లను, నర్సులను అవమానిస్తే తీవ్రమైన చర్యలుంటాయని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ అన్నారని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ కు చెప్పాలని సూచించారని ఆయన అన్నారు. 8 ఆస్పత్రులను కోవిడ్ -19 ప్రత్యేక ఆస్పత్రులుగా తీర్చిదిద్దామని, 9 ల్యాబ్ లు ఉన్నాయని ఆయన అన్నారు. లక్ష మందికి చికిత్స చేసే సదుపాయాలు కల్పించామని ఆయన అన్నారు. ఈ విషయాన్ని కూడా హర్షవర్దన్ ప్రస్తావించారని ఆయన గుర్తు చేశారు. వైద్య పరికరాలకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే దిగుమతి సుంకం రాయితీ ఇవ్వాలని, దేశియంగా కొంటే జీఎస్టీ నుంచి మినహాయించాలని అడిగినట్లు ఆయన తెలిపారు.
ప్లాస్మా థెరపీని తెలంగాణలో వాడుతామని ఈటెల రాజేందర్ చెప్పారు. రైతులు ధాన్యాల కొనుగోలు విషయంలో ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. మన రాష్ట్రంలో డాక్టర్లకు ఎవరికీ కరోనా రాలేదని ఆయన అన్నారు.
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23 వేలు దాటిన విషయం తెలిసిందే. గత 24 గంటల్లో దేశంలో 23,077 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ వ్యాధితో దేశంలో మొత్తం 725 మంది మరణించారు.