హైదరాబాద్: నకిలీ మోటార్ వాహనాల ఇన్సూరెన్స్ ముఠాను మంగళవారంనాడు సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇవాళ తన కార్యాలయంలో ఈ ముఠాకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ వివరించారు. పెట్రోల్ బంకులు, రోడ్ల పక్కన ఈ నకిలీ మోటార్ వాహనాల ఇన్సూరెన్స్  సర్టిపికెట్ల జారీ ముఠా అడ్డా వేస్తోందన్నారు.

వినియోగదారులను మాటల్లో పెట్టి నకిలీ ఇన్సూరెన్స్  తీసుకొనేలా ఒప్పిస్తారు. ఈ మాటలను నమ్మి ఇన్సూరెన్స్ తీసుకొంటే  మోసపోయినట్టేనని సజ్జనార్ తెలిపారు. 

చాలలా కాలంగా ఇలా ఇన్సూరెన్స్ తీసుకొన్న వారు మోసపోయారు. ఈ తరహాలో మోసపోయిన ఘటన 2016 లో తొలుత కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ లో చోటు చేసుకొందని సీపీ చెప్పారు. 

కచ్చితమైన సమాచారం ఆధారంగా ఈ ముఠాకు చెందిన 11 మందిని అరెస్ట్ చేశామన్నారు.  నిందితులనుండి 1125 నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకొన్నామన్నారు.

నిజమైన ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లను పోలినట్టుగానే ఈ సర్టిఫికెట్లు ఉంటాయని ఆయన తెలిపారు.రూ. 10 వేల ఇన్సూరెన్స్ ను రూ. 2 వేలకు తీసుకోవచ్చని నమ్మించి ఈ ముఠా మోసం చేస్తోందని సజ్జనార్ తెలిపారు.

పొల్యూషన్ వెహికిల్ నిర్వాహకుడు రమేష్ నకిలీ ఇన్సూరెన్స్ ముఠాలో ప్రధాన సూత్రధారిగా సీపీ చెప్పారు. ఈ తరహా మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు.