ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని ఆశపడింది.  అయితే.. ఆమె ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో మనస్థాపానికి చెందిన యువతి బాత్‌రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మోకిలతండాలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం.. మోకిలతండాకు చెందిన జెత్యానాయక్‌ కూతురు అనూష(19)10వ తరగతి వరకు చదువుకుంది.

 జెత్యానాయక్‌ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అనూష ఇటీవల నర్సు కోర్సుకోసం బెంగుళూరు వెళ్లి ఈనెల 5న వస్తానని చెప్పి వెళ్లింది. అప్పటి నుంచి ఫోన్‌ చేయకపోవడంతో తల్లిదండ్రులు ఈనెల 6న తమ కూతరు కనిపించటం లేదని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

యువతిని ట్రేస్‌ చేసి శనివారం ఇంటికి రప్పించారు. తను ఒక వ్యక్తిని ప్రేమించానని చెప్పడంతో పోలీసులు అమ్మాయికి కౌన్సెలింగ్‌ ఇచ్చి తల్లిదండ్రులతో ఇంటికి పంపించారు. శనివారం సాయంత్రం ఇంటికి వెళ్లిన యువతి తాను ఒక వ్యక్తిని ప్రేమించానని అతన్నేపెళ్లిచేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పింది. ఇందుకు వారు వద్దని వారించారు. దీంతో ఆదివారం ఉదయం స్నానానికి వెళ్లిన యువతి బాత్‌రూమ్‌లో చున్నీతో ఉరేసుకుంది. స్నానానికి వెళ్లిన అనూష ఎంతకు రాకపోవడంతో తల్లిదండ్రులు బాత్‌రూమ్‌ తలుపులు పగులగొట్టి చూడగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దార్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.