న్యూఢిల్లీ: హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ప్రమాణస్వీకారం చేసేందుకు వెళ్తున్న సమయంలో సభలో గందరగోళం నెలకొంది. అసదుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసేందుకు పోడియం దగ్గరకు వెళ్తున్నంత సేపు సభలో జై శ్రీరాం, భారత్‌ మాతాకీ జై, వందేమాతరం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

వారి నినాదాలను పట్టించుకోకుండా అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. అసదుద్దీన్ తన ప్రసంగం చివర్లో జై భీమ్, జై మీమ్, అల్లాహ్ అక్బర్ అంటూ ముగించారు. దాంతో సభలో నినాదాలు నిలిచిపోయాయి. అయితే బీజేపీ ఎంపీల నినాదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అసదుద్దీన్ ఓవైసీ. 

తాను ప్రమాణ స్వీకారం చేసేందుకు వెళ్తున్నప్పుడు నన్ను చూసి జై శ్రీరామ్, వందేమాతరం అంటూ నినాదాలు చేయడం మంచిదేనన్నారు. వారు రాజ్యాంగాన్ని కూడా గుర్తుంచుకుంటారని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో ముజాఫర్పూర్లో పిల్లల మరణాలు కూడా వారు గుర్తుంచుకుంటే మంచిందంటూ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు.