సంచలనాలు నెలకొల్పడంలో రికార్డు స్రుష్టించిన చైనా స్మార్ట్ ఫోన్ మేజర్ షావోమీ మరో సెన్సేషన్ కోసం రంగం సిద్ధం చేసింది. ప్రపంచంలో కెల్లా 48 - మెగా పిక్సెల్ కెమెరాతో కూడిన స్మార్ట్ ఫోన్‌ ‘రెడ్ మీ ప్రో2’ను మార్కెట్లోకి విడుదల చేయనున్నది.

ఇది సోనీ ఆధ్వర్యంలోని ఐఎంఎక్స్ 586, శామ్‌సంగ్‌కు చెందిన ‘ఐఎస్ఓసీఈఎల్ఎల్ బ్రైట్ జీఎం1’లకు విడివిడిగా, రెండు సంస్థల ఫోన్లతోనూ ఢీకొట్టనున్నది. చైనాలో ఈ నెల 10వ తేదీన అధికారికంగా రెడ్ మీ స్మార్ట్ ఫోన్‌ను షావోమీ మార్కెట్లోకి ఆవిష్కరించనున్నది.

రెడ్ మీ స్మార్ట్ ఫోన్ల ఆవిష్కరణను సంస్థ యాజమాన్యం కూడా ధ్రువీకరించింది. షావోమీ అధ్యక్షుడు లిన్ బిన్.. చైనా సోషల్ మీడియా వేదిక వైబో ద్వారా గత నెలలోనే ప్లస్ డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ కల షావోమీ మెగా పిక్సెల్ స్మార్ట్ ఫోన్ క్లోజప్ వ్యూను పోస్ట్ చేశారు. 

ఇప్పటివరకు హువాయి మేట్ 20 ప్రో, పీ20 ప్రో మోడల్ స్మార్ట్ ఫోన్లు విడుదల చేసినా, వాటిలోని కెమెరాలు 40 మెగా పిక్సెల్స్‌తో కూడినవి. అయితే షావోమీ తాజాగా తన కెమెరాలో ఎన్ని సెన్సార్లు ఏర్పాటు చేస్తారన్న సంగతి బయటపెట్టలేదు. లిన్ బిన్ పోస్ట్ చేసిన ఫోటో ప్రకారం ఎల్ఈడీ ఫ్లాష్‌తో వెర్టికల్ కెమెరా ఉంటుందని అర్థమవుతుంది. ఒకటికంటే ఎక్కువగా సెన్సార్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు.