అసలే కేంబ్రిడ్జి అనలిటికా, డేటా చౌర్యం తదితర సమస్యలతో సతమతం అవుతున్నది ఫేస్‌బుక్‌ సంస్థ. దాని అనుబంధ సంస్థ వాట్సప్‌ కూడా ఫేక్ న్యూస్ సమస్యను ఎదుర్కొంటున్నది.

ఇటువంటి తరుణంలో సంస్థ  నుంచి మరో ఉన్నతాధికారి తప్పుకున్నారు. ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు జాన్‌ కౌమ్‌ గత మే నెలలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన ఏడు నెలల్లోనే వాట్సాప్‌ ముఖ్య వాణిజ్యాధికారి (సీబీఓ) నీరజ్‌ అరోరా వైదొలుగుతున్నట్లు మంగళవారం ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. 

కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నీరజ్‌ తెలిపారు. ఈ సందర్భంగా తనను సంస్థలోకి ఆహ్వానించిన వాట్సాప్‌ వ్యవస్థాపకులు జాన్‌ కౌమ్‌, బ్రియాన్‌ ఆక్టన్‌తోపాటు సహ ఉద్యోగులందరికీ నీరజ్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

‘వాట్సప్‌ నుంచి వెళ్లిపోయే సమయం ఆసన్నమైంది. నిత్యం యాప్‌ ద్వారా ఎంతో మంది అవసరాలు తీరుస్తూ, వారిని పలకరిస్తున్నందుకు గర్వంగా ఉంది. నేను కొంత మంది సాధారణ ఉద్యోగులతోపాటు సంస్థలో చేరాను.

ఇప్పుడు బిలియన్ల మంది ప్రజల దృష్టిని ఆకర్షించడం నిజంగా అద్భుతం‌. భవిష్యత్‌లో మరింత నమ్మకమైన, భద్రత గల మెసెంజర్‌గా వాట్సాప్‌ కొనసాగుతుందని నేను బలంగా నమ్ముతున్నాను.’’ అని తన పోస్ట్‌లో వివరించారు.

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో చదువుకున్న నీరజ్‌ అరోరా 2011లో వాట్సాప్‌ సంస్థలో చేరారు. 2014లో వాట్సాప్‌ను ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వాట్సాప్‌లో అత్యున్నత స్థానంలో ఉన్న వారు ఇటీవల వైదొలుగుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాట్సాప్‌ సహ వ్యవస్థాపకుడైన బ్రియాన్‌ ఆక్టన్‌ గతేడాది సెప్టెంబరులో సంస్థ నుంచి తప్పుకోగా.. ఈ ఏడాది మేలో జాన్‌ కౌమ్‌ బయటకు వచ్చారు. 

మార్క్‌ జుకర్‌ బర్గ్, షెరియల్‌ శాండ్‌బర్గ్‌‌తో అభిప్రాయభేదాలు తలెత్తడంతోనే తాను తప్పుకున్నట్లు కౌమ్‌ ప్రకటించారు. ఈ ఏడాది మొదట్లో కేంబ్రిడ్జ్‌ అనలిటికా కుంభకోణం ఫేస్‌బుక్‌ను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఇది జరిగాక ఇన్‌స్టాగ్రామ్‌ సీఈఓ కెవిన్‌ సిస్ట్రోమ్‌, సీటీఓ మైక్‌ క్రెగ్గర్‌ సైతం ఫేస్‌బుక్‌ నుంచి తప్పుకున్నారు.

ఆర్బీఐ స్వయంప్రతిపత్తికి నో ప్రాబ్లం అన్న సెబీ దామోదరన్
ప్రభుత్వంతో ఇటీవల ఏర్పడిన విభేదాలతో ఆర్‌బీఐ స్వతంత్రతకు వచ్చిన ముప్పేమీ లేదని సెబీ మాజీ ఛైర్మన్‌ ఎన్‌.దామోదరన్‌ పేర్కొన్నారు. పటిష్టమైన సంస్థగా ఉన్న ఆర్‌బీఐ, స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని, ఇటీవలి పరిణామాల వల్ల అందులో మార్పు రాదన్నారు.

గతంలోనూ చాలాసార్లు విభేదాలు తలెత్తినా, ఆర్బీఐకి కష్టం రాలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఆర్బీఐ స్వతంత్రతను కట్టడి చేస్తున్నారనే భావన సరికాదని సీఐఐ సమావేశంలో దామోదరన్‌ తెలిపారు. గతంలో ప్రభుత్వంతో ఆర్బీఐకి విభేదాలు తలెత్తినపుడు, ఆర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్‌ చర్చించుకుని, పరిష్కరించుకునే వారని దామోదరన్ అన్నారు.

ఈసారి కూడా ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య బహిరంగ చర్చ జరగడం వల్ల, సంబంధం లేని బయటివ్యక్తులు కూడా జోక్యం చేసుకున్నారని సెబీ మాజీ చైర్మన్ దామోదరన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వ లక్ష్యం ఎప్పుడూ వృద్ధే. ధరలు అదుపులో ఉంచడం ద్వారా, ద్రవ్యోల్బణం మితిమీరకుండా చూడటం ఆర్‌బీఐ బాధ్యత.

వీటి మధ్య సమన్వయం సంప్రదింపులతోనే లభిస్తుంది’ అని దామోదరన్‌ విశదీకరించారు. అంతేకానీ పత్రికలకు ఎక్కడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. ఆర్థిక రంగంలో నమ్మకం లేకపోతే, ఎంత సాంకేతికత ఉన్నా ప్రయోజనం ఉండదని స్పష్టంచేశారు.