ఇదీ 2019 డిమాండ్: అన్ని రంగాల్లోనూ అతివలకు జాబ్స్

నైపుణ్యం గల మహిళలైతే వచ్చే ఏడాది ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఐటీ నుంచి ఫైనాన్స్, బీమా రంగం వరకు ఆతిథ్యం నుంచి ఆటోమొబైల్ వరకు నైపుణ్యాన్ని బట్టి మహిళలకు అవకాశాలు లభిస్తాయి. 

Up to 20% more women tipped to join workforce in 2019: Report

కొత్త కొలువుల కోసం ఎదురు చూస్తున్న మహిళలకు శుభవార్త‌. ఈ ఏడాదితో పోలిస్తే వచ్చే ఏడాది అతివల నియామకాలు15 నుంచి 20 శాతం వరకు పెరగనున్నాయని పీపుల్‌స్ట్రాంగ్‌ అనే ఒక సంస్థ ‘ది ఇండియన్‌ స్కిల్స్‌ రిపోర్ట్‌-2019’ పేరుతో విడుదల చేసిన తాజా నివేదిక పేర్కొంది. ఇందుకోసం ఈ సంస్థ 15 రంగాలకు చెందిన వెయ్యి కంపెనీల నియామక అవసరాలను పరిశీలించిన తర్వాత ఈ నివేదిక రూపొందించింది.

బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా రంగం (బీఎఫ్ఎస్‌ఐ), ఆటోమొబైల్‌, ఐటీ, సాఫ్ట్‌వేర్‌, ఆతిథ్య రంగం, ట్రావెల్‌ రంగాల్లో వచ్చే ఏడాది మహిళల నియామకాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నదని తెలిపింది. కొత్త నైపుణ్యాలు అలవర్చుకుంటే 2025 నాటికి ఐటీ, బీపీఓ రంగాల్లో కొత్తగా 25 లక్షల నుంచి 30 లక్షల కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయని తెలిపింది.
 
సామాజిక కట్టుబాట్లు, పని ప్రదేశంలో భద్రత, కొన్ని ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు లేక మహిళలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాల్లోకి రాలేకపోతున్నారు. ఈ సమస్యలను అధిగమిస్తే ఉద్యోగాల్లో మహిళల సంఖ్య మరింత పెరుగుతుందని పీపుల్‌ స్ట్రాంగ్‌ సంస్థ వ్యవస్థాపకుడు దేవాశిష్‌ శర్మ చెప్పారు. విదేశాలతో పోలిస్తే మన దేశంలో ఉద్యోగాల్లో మహిళల సంఖ్య ఇప్పటికీ తక్కువేనని నివేదిక పేర్కొంది. 

ఈ ధోరణిలో క్రమంగా మార్పు వస్తోంది. ఉద్యోగాలకు పనికొచ్చే (ఎంప్లాయబిలిటీ) స్త్రీల సంఖ్యా పెరుగుతోంది. 2017లో సంబంధిత కోర్సులు పూర్తి చేసిన యువతుల్లో 38 శాతం మంది ఉద్యోగాలకు అవసరమైన నైపుణం ఉంటే, ఈ సంవత్సరం అది 46 శాతానికి పెరిగింది. 

మహిళలు ఉద్యోగాల్లో చేరడాన్ని ప్రోత్సహించడం ద్వారా 2025 నాటికి భారత్‌ తన జీడీపీని 16 నుంచి 60 శాతం వరకు పెంచుకునే అవకాశం ఉందని 2015లో విడుదలైన మెకెన్సీ గ్లోబల్‌ స్టడీ నివేదికను పీపుల్‌స్ట్రాంగ్‌ సంస్థ గుర్తు చేసింది.
 
కొత్త కొలువుల నియామకాల కోసం కంపెనీలు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే మొదటి 10 రాష్ట్రాల్లో ఆంధప్రదేశ్‌ ముందు వరుసలో ఉన్నదని ‘ది ఇండియన్‌ స్కిల్స్‌ రిపోర్ట్‌, 2019 పేర్కొంది. ఈ విషయంలో తెలంగాణ మాత్రం ఆఖరి స్థానంలో ఉంది. 

కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులు పని చేసేందుకు ఎక్కువగా ఇష్టపడే రాష్ట్రాల్లోనూ ఏపీనే ముందుందని తెలిపింది. మహారాష్ట్ర, తమిళనాడు ఈ రెండు విషయాల్లో టాప్‌-5 స్థానాల్లో నిలిచాయి. నియామకాల కోసం కంపెనీలు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే రాష్ట్రాల్లో ఈ ఏడాది పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, తెలంగాణ కూడా చేరాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios