టెల్కోలపై ట్రాయ్ కొరడా: టాక్ టైం బ్యాలెన్స్ ఉంటే సేవలు నిలిపేయొద్దు

రిలయన్స్ జియోతో పడిపోయిన తమ ఆదాయం పెంచుకునేందుకు ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా అనుసరిస్తున్న వ్యూహంపై ట్రాయ్ మండిపడింది. మినిమం రీచార్జి ప్లాన్లు అమలులోకి తెచ్చిన టెలికం సంస్థలు ఇప్పటికే టాక్ టైం మిగిలి ఉన్నా వినియోగదారులను ఇబ్బందుల పాల్జేయవద్దని హెచ్చరించింది.

Trai pulls up Airtel, Vodafone-Idea on minimum recharge plans

టెలికాం కంపెనీలపై ఆ రంగ నియంత్రణ మండలి ట్రాయ్‌‌ ఆగ్రహం వ్యక్తంజేసింది. ప్రీ-పెయిడ్‌ టాక్‌టైం బ్యాలెన్స్‌ తగినంత ఉన్న కస్టమర్ల సేవలను తక్షణమే నిలిపివేయవద్దని ఆపరేటర్లను ఆదేశించింది.

తమ మొబైల్‌లో తగినంత టాక్‌టైం బ్యాలెన్స్‌ ఉన్నా సేవలు కొనసాగాలంటే తప్పనిసరిగా రీచార్జ్‌ చేసుకోవాలని మొబైల్‌ సేవల సంస్థలు తమకు సందేశాలు పంపుతున్నాయని ట్రాయ్‌కుప్రీ-పెయిడ్‌ కస్టమర్ల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ ఈ వారం ప్రారంభంలో టెలికం ప్రొవైడర్లతో సమావేశమై చర్చించారు.

సాధారణంగా టెలికాం కంపెనీల చార్జీలు, రీచార్జ్‌ ప్లాన్లలో కలుగ జేసుకోమని, ఖాతాలో తగినంత టాక్‌టైం బ్యాలెన్స్‌ ఉన్నప్పటికీ సేవలు నిలిపివేస్తామని సంస్థలు హెచ్చరించడం మాత్రం సరికాదని ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌ ఎస్‌ శర్మ అన్నారు. సేవలను ఇప్పటికిప్పుడే నిలిపివేయవద్దని మంగళవారమే టెలికాం కంపెనీలను ఆదేశించామని పేర్కొన్నారు. 

‘ఈ సమస్యను సమగ్రంగా పరిశీలిస్తున్నాం. ఈ  విషయంలో కస్టమర్లకు చాలా స్పష్టంగా, పారదర్శకమైన సమాచారం అందించాలి’ అని టెలికం ప్రొవైడర్లను ట్రాయ్ కోరింది. ప్రస్తుత ప్లాన్‌ కాలపరిమితి ఎప్పుడు ముగియనుంది? 

కనీస రీచార్జ్‌ ప్యాక్‌తోపాటు ప్రస్తుతం అందుబాటులో ప్లాన్లను ఎలా పొందవచ్చని కస్టమర్లకు ఎస్‌ఎంఎ్‌సల ద్వారా 72 గంటల్లో సమాచారం అందించాలని కోరింది. అప్పటివరకు, ప్రస్తుత కనీస రీచార్జ్‌ ప్యాక్‌తో సమానమైన టాక్‌టైం గల కస్టమర్ల సేవలను నిలిపివేయవద్దని ఆపరేటర్లను ఆదేశించింది. 

టెలికాం స్పెక్ట్రమ్‌ విలువ మదింపు విధానం, లీజింగ్‌, వేలం విధానంతోపాటు పలు అంశాలపై వచ్చే ఏడాది లోతుగా చర్చించనున్నట్లు ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌ ఎస్‌ శర్మ తెలిపారు.టెలికాం రంగంలోకి 4జీ సేవలతో రిలయన్స్ జియో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇతర టెలికం కంపెనీలు విలవిల్లాడుతున్నాయి. 

గత రెండేళ్లలో టెలికాం సేవల వినియోగం అనూహ్యంగా పెరిగినా సంస్థల లాభదాయకత భారీగా క్షీణించింది. అదే సమయంలో కంపెనీలపై అప్పులభారం భరించలేని స్థాయికి పెరిగింది. దాంతో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా సంస్థలు ఒక్కో కస్టమర్‌ నుంచి లభించే సరాసరి ఆదాయాన్ని (ఏఆర్‌పీయూ) పెంచుకోవడంపై దృష్టి సారించాయి. అందులోభాగంగానే మినిమమ్‌ రీ చార్జ్‌ టారిఫ్‌ను పెంచేశాయి. 

28 రోజుల కాలపరిమితితో కూడిన రూ.35 రీచార్జ్‌ పథకాన్ని ప్రవేశపెట్టాయి. ఎయిర్‌టెల్‌ ప్రవేశపెట్టిన రూ.35 రీచార్జ్‌ ప్లాన్‌లో భాగంగా రూ.26 టాక్‌టైంతోపాటు 100 ఎండీ డేటా లభిస్తుంది. ఇప్పటివరకు రూ.10 టాప్‌ అప్‌ కూపన్‌తో రీచార్జ్‌ చేసుకుంటే రూ.7 టాక్‌టైం లభించేది.

ఆ టాక్‌ టైం వినియోగించుకున్నాక ఔట్‌గోయింగ్‌ కాల్స్‌ చేయలేకపోయినా.. గరిష్ఠంగా ఆరు నెలల వరకు ఇన్‌కమింగ్‌ కాల్స్‌ అందుకునే సౌకర్యం లభిస్తుంది. కానీ రూ.35 రీచార్జ్‌ కూపన్‌ ప్రవేశంతో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా నెట్‌వర్క్‌ల సేవలందుకోవాలంటే ప్రతినెలా రీచార్జ్‌ చేసుకోవాల్సిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios