టార్గెట్ శామ్‌సంగ్: రెడ్‌మీ ఫోన్లపై జియోమీ భారీ ఆఫర్లు
దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘శామ్‌సంగ్’దెబ్బకు చైనా మేజర్ జియోమీ అనుబంధ రెడ్ మీ దిగి వచ్చింది. రెడ్ మీ 6 మోడల్ వేరియంట్లపై రూ.500 నుంచి రూ.2000 వరకు డిస్కౌంట్లు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్ బుధ, గురు, శుక్రవారాల్లో మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
ఒకనాడు రారాజుగా వెలుగొందిన దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్‌ను గతేడాది చైనా మొబైల్ మేకర్ జియోమీ అనుబంధ సంస్థ రెడ్‌మీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లతో భారత్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్ ను కైవసం చేసుకున్నది. తాజాగా అదే మంత్రంతో శామ్‌సంగ్ గేలాక్సీ ఎం సిరీస్ ఫోన్లను మార్కెట్లోకి శామ్‌సంగ్ విడుదల చేయడంతో రెడ్ మీ అప్రమత్తమైంది. భారత్‌లో తన స్మార్ట్ ఫోన్ల ధరలను తాత్కాలికంగా తగ్గించింది.
జియోమీ ‘రెడ్ మీ’ ఫోన్లు ఈ నెల ఆరో తేదీ నుంచి 8వ తేదీ మధ్య మాత్రమే ఈ తగ్గింపు ధరలకే అందుబాటులో ఉండనున్నాయి. జియోమీ తాజా నిర్ణయంతో రెడ్‌మీ 6ఎ, రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ప్రొ స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై రూ.500 నుంచి రూ.2 వేల మధ్య రాయితీ పొందొచ్చు. జియోమీ ఈ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో బుధవారం నుంచి తగ్గింపు ధరలతో ఫోన్లను కొనుగోలు చేసుకోవచ్చు.
రెడ్‌మీ 6 ప్రొ 4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్‌ను ఇప్పుడు రూ.10,999కే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.12,999 కాగా, రూ.2 వేలు తగ్గించి విక్రయిస్తోంది. రెడ్‌మీ 6 ప్రొ వేరియంట్ 3 జీబీ ర్యామ్/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌పైనా రూ.2 వేలు తగ్గించి రూ.8,999కే విక్రయిస్తోంది.
ఎంట్రీలెవల్ స్మార్ట్‌ఫోన్ 6ఎ 2జీబీ ర్యామ్/32 జీబీ స్టోరేజీ మోడల్ ధరను రూ.500 తగ్గించి రూ.6,499కే అందుబాటులో తెచ్చింది. రెడ్‌మీ 6 3జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్‌ను రూ.10,499లకు బదులు రూ.8,499కి తగ్గించి విక్రయిస్తోంది.
రెడ్ మీ 6 ప్రో 3జీ ర్యామ్ ప్లస్ 32 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.11,499 కాగా, రూ.8,999లకే వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది. రెడ్ మీ 6 ప్రో 4జీబీ ప్లస్ 64 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ రూ.13,499లకు బదులు రూ.10,999లకే విక్రయిస్తోంది.
శామ్ సంగ్ గేలాక్సీ ఎం10 వేరియంట్ ఫోన్ 2జీబీ ప్లస్ 16 జీబీ, 3జీబీ ప్లస్ 32 జీబీ స్టోరేజీ సామర్థ్యంలో అందుబాటులోకి తీసుకొస్తున్నది. 2జీబీ ప్లస్ 16 జీబీ స్టోరేజీ ఫోన్ ధర రూ.7,990, 3జీబీ ప్లస్ 32 జీబీ స్టోరేజీ ఫోన్ ధర రూ.8,990లకే లభిస్తోంది. ఇక ఎం 20 మోడల్ 3జీబీ ప్లస్ 32జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,990, 4జీబీ ప్లస్ 64 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ రూ.12,990లకు లభిస్తోంది.
ఈ నాలుగు ఫోన్లకు విపరీతమైన ఆదరణ లభిస్తుండటంతో శామ్ సంగ్ యాజమాన్యం ఉబ్బి తబ్బిబ్బవుతున్నట్లు వార్తలొచ్చాయి. దీనికి తోడు ఫోన్ డ్యామేజీ ప్రొటెక్షన్ ప్లాన్‌ను అమెజాన్ అందుబాటులోకి తెచ్చింది. జియో వినియోగదారులకు రూ.3,310 వరకు డబుల్ డేటా ఆఫర్ సేవ్ చేసుకోవచ్చు. ఆరు నెలల వరకు నెలసరి వాయిదాల భారం కూడా లేదు.