ఎస్బీఐ పేపర్‌లెస్ ‘యోనో’ అక్కౌంట్స్ సస్పెన్షన్
ఆధార్ తప్పనిసరి కాదంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన తర్వాత డిజిటల్ ఖాతాలను ప్రారంభించడానికి ఇతర ప్రత్యామ్నాయాలు సూచించాలని ఆర్బీఐని భారతీయ స్టేట్ బ్యాంక్ కోరింది. అప్పటివరకు ‘యోనో’ ఖాతాలు తెరిచే విధానాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
న్యూఢిల్లీ: ‘యూ ఓన్లీ నీడ్ వన్ (యోనో)’ యాప్ ద్వారా కాగిత రహిత బ్యాంక్ ఖాతాలను తెరిచే విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) నిర్ణయించింది. ఆధార్ వినియోగంపై పరిమితులు విధిస్తూ గత సెప్టెంబర్ 26వ తేదీన సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ అధికారి ఒకరు తెలిపారు. డిజిటల్ అకౌంట్లను తెరవడానికి ప్రత్యామ్నాయ పరిష్కార సాధనాల వినియోగంపై స్పష్టత ఇవ్వాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్‌ను కోరినట్లు వివరించారు.
వివిధ రకాల బ్యాంకింగ్ సేవలు పొందడానికి ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయడం తప్పనిసరేమీ కాదంటూ సెప్టెంబర్ 26న సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఎలక్ట్రానిక్ పద్ధతిలో గుర్తింపు ధృవీకరణ (ఈ–కేవైసీ) కుదరని పరిస్థితి నెలకొన్నది. గతేడాది నవంబర్‌లో ప్రారంభించిన డిజిటల్ ప్లాట్‌ఫాం ‘యోనో’ ద్వారా బ్యాంకు శాఖకు కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఖాతాను తెరవడం నుంచి అన్ని రకాల ఆర్థిక సేవలను పొందే వెసులుబాటును ఎస్బీఐ అందుబాటులోకి తెచ్చింది.
నష్టాల్లో పీఎన్బీ ఫస్ట్
మొండి బకాయిలకు అధిక కేటాయింపులతో ప్రభుత్వ రంగ బ్యాంకుల నష్టాలు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మూడున్నర రెట్లు పెరిగి రూ.14,716.20 కోట్ల మేరకు పెరిగిపోయాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలోని 21 ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉమ్మడి నష్టం రూ.62,681.27 కోట్లుగా రికార్డైంది. సెప్టెంబర్ నెలాఖరుతో ముగిసే త్రైమాసికానికి వివిధ బ్యాంకులు ప్రకటించిన ఆర్థిక ఫలితాలను బట్టి చూస్తే గరిష్ఠంగా నష్టం ప్రకటించిన బ్యాంకు పీఎన్‌బీ నిలిచింది.
రెండో త్రైమాసికంలో 7,733.27 కోట్లకు మొండి బాకీలు
నీరవ్ మోదీ కుంభకోణం ఊబిలో కూరుకుపోయిన ఈ బ్యాంకు గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.560.58 కోట్ల లాభం ఆర్జించగా ఈ ఏడాది రెండో త్రైమాసికంలో రూ.4,532.35 కోట్ల భారీ నష్టం ప్రకటించింది. మొండి బాకీలకు ఆ బ్యాంకు కేటాయించిన మొత్తం రూ.2,693.78 కోట్ల నుంచి రూ.7,733.27 కోట్లకు దూసుకుపోయింది. ద్వితీయ త్రైమాసికంలో ఐడీబీఐ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు నష్టాలు భారీగా పెరిగిపోయాయి. ఐడీబీఐ బ్యాంకు నష్టం రూ.197.84 కోట్ల నుంచి రూ.3,602.50 కోట్లు, అలహాబాద్ బ్యాంకు నష్టం రూ.70.20 కోట్లకు పెరిగాయి.
సంస్కరణలు కొనసాగించాలన్న అరవింద్ పనగరియా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా నిర్దేశించుకున్న ద్రవ్య లోటుకు కట్టుబడి ఉండాలని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా సూచించారు. అంతేకాక నాలుగేళ్లుగా చేపట్టిన సంస్కరణలను అదే విధంగా కొనసాగించాలని సూచించారు. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), బ్యాంక్‌రప్టసీ కోడ్ (ఐబీసీ) వంటి క్లిష్టమైన సంస్కరణలను అమలు చేయడంలో ప్రభుత్వం పురోగతి సాధించిందని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ద్రవ్య నియంత్రణను సాధించడంలో విజయం సాధించిందని, దీని ఫలాలు కూడా కనిపించాయన్నారు. గత నాలుగేళ్ల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సగటున 7.3 శాతం వృద్ధిని సాధించిందని, అంతకు ముందు రెండేళ్ల యూపీఏ హయాంలో వృద్ధి 5.9 శాతంగా ఉందని సెలవిచ్చారు