Asianet News TeluguAsianet News Telugu

జియోమీతో పోటీకి సామ్‌సంగ్ రెడీ...అత్యంత తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ మళ్లీ భారత స్మార్ల్ ఫోన్ల మార్కెట్లో అగ్ర స్థానంలోకి రావాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా ఎం’ సీరిస్‌ ఫోన్లను భారత విపణి కోసమే అభివృద్ధి చేసింది.  ధర శ్రేణి రూ.10,000-20,000 మధ్య ఉంటుందని అంచనా. ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నది.  

samsung Galaxy M Series India Launch on January 28, Company Confirms
Author
Hyderabad, First Published Jan 16, 2019, 11:48 AM IST

న్యూఢిల్లీ: భారత స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో టాప్‌వన్ ప్లేస్ దక్కించుకునేందుకు దక్షిణ కొరియా మొబైల్ మేజర్ శామ్‌సంగ్ సిద్ధమవుతోంది. అందుబాటు ధరలో స్మార్ట్‌ ఫోన్లతో మొబైల్ ప్రేమికులను ఆకర్షించాలని భావిస్తోంది. కొంత కాలం క్రితం వరకూ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో శామ్‌సంగ్ రారాజు. కానీ వ్యూహాత్మకంగా చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం జియోమీ అందుబాటు ధరల్లో స్మార్ట్ ఫోన్లు విడుదల చేసిన భారతీయులను ఆకట్టుకుని మొదటి స్థానానికి చేరుకున్నది.

కానీ తిరిగి తన స్థానాన్ని పొందేందుకు  అందుబాటు ధరల్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు శామ్‌సంగ్ రెడీ అవుతోంది. ఈ క్రమంలో మార్కెట్‌లోకి ‘గెలాక్సీ ఎం’ సీరిస్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తామని ప్రకటించింది. భారత మార్కెట్‌ కోసమే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు శామ్‌సంగ్ తెలిపింది. గెలాక్సీ ఎం సీరిస్‌ స్మార్ట్‌ఫోన్ల ధర రూ.10,000 నుంచి రూ.20,000 వరకూ ఉంటుంది. గెలాక్సీ ఎం10, ఎం20, ఎం30 పేర్లతో కొత్త ఫోన్లను విడుదల చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
 
భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో మళ్లీ రెండంకెల వృద్ధి సాధించాలని భావిస్తున్న కంపెనీ ‘ఎం’ సీరిస్‌ ఫోన్లు ఇందుకు దోహదపడతాయని ఆశిస్తోంది. కొత్త ఫోన్లను ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు శామ్‌సంగ్ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అసిమ్‌ వార్సి తెలిపారు. 

ఈ ఫోన్లను కేవలం ఆన్‌లైన్‌ లోనే విక్రయిస్తామన్నారు. తొలుత శాంసంగ్‌ వెబ్‌సైట్‌, ఈ-కామర్స్‌ పోర్టల్‌ అమెజాన్‌ ద్వారా విక్రయిస్తామని శామ్‌సంగ్ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అసిమ్‌ వార్సి చెప్పారు. ఆ తర్వాత ఇతర ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌లోనూ అందుబాటులోకి వస్తాయన్నారు. మిలీనియల్స్‌, భారత మార్కెట్‌ కోసమే ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేసినట్లు వార్సి వివరించారు.  
 
2019లో గెలాక్సీ ఎం సీరీస్‌తో భారత మార్కెట్లోకి సరికొత్త ఉత్పత్తిని ప్రవేశపెడుతున్నామని శామ్‌సంగ్ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అసిమ్‌ వార్సి తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ కోసం పెట్టుబడులతో పాటు ప్లాంట్‌, ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ల విస్తరణను చేపట్టామన్నారు. ఇండియన్ల అవసరాలే శామ్‌సంగ్‌కు ముఖ్యమని, అందుకనుగుణంగానే దృష్టి పెడతామని తెలిపారు. 

ఈ-కామర్స్‌ కంపెనీల కోసం రూపొందించిన కొత్త నిబంధనలకు అనుగుణంగానే ఆన్‌లైన్‌లో ఉత్పత్తుల విక్రయాన్ని చేపట్టినట్లు శామ్‌సంగ్ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అసిమ్‌ వార్సి వివరించారు. ఈ నిబంధనలు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఆన్‌లైన్‌ మార్కెట్లో ఫోన్లను విక్రయిస్తూ.. వినియోగదారులను జియోమీ ఆకర్షిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios