రేడియేషన్ తంటా.. జియోమీ, వన్‌ప్లస్ కంటే శామ్‌సంగ్ సేఫ్
టెక్నాలజీ అంటేనే రేడియేషన్ అనుసంధానమై ఉంటుంది. మనం నిత్యం స్మార్ట్ ఫోన్లు, ట్యాబెట్లు వాడుతున్నాం. వాటి వాడకంతోపాటు రేడియేషన్ కూడా భారీగానే వెలువడుతూ ఉంటుంది. అయితే తక్కువ రేడియేషన్ వదిలే స్మార్ట్ ఫోన్లు వాడితే సేఫ్టీ ఎక్కువ.
స్మార్ట్‌ఫోన్లు రేడియేషన్ వెదజల్లుతుందని అందరికీ తెలిసిన సంగతే. కానీ ఫోన్ల నుంచి రేడియేషన్ ఒకేస్థాయిలో వెలువడదన్నదీ నిజమే. అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌పై చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు జియోమీ, వన్‌ప్లస్ సంస్థల ఫోన్లు అని తేలింది. దక్షిణకొరియా స్మార్ట్‌ఫోన్ మేజర్ శామ్‌సంగ్ ఆవిష్కరిస్తున్న ఫోన్లలో రేడియేషన్ స్థాయి తక్కువగా ఉన్నదని ‘జర్మన్ ఫెడరల్ ఆఫీస్ ఫర్ రేడియేషన్ ప్రొటెక్షన్’నివేదిక పేర్కొంది.
జర్మన్ ఫెడరల్ ఆఫీస్ ఫర్ రేడియేషన్ ప్రొటెక్షన్ అందించిన డేటాతో స్టాటిస్టా అనే డేటాబేస్ సంస్థ స్మార్ట్‌ఫోన్ల రేడియేషన్ స్థాయిపై జాబితాను రూపొందించింది. దీని ప్రకారం జియోమీ ఎంఐ ఏ1 అత్యధికంగా రేడియేషన్ వెదజల్లుతోంది. ఈ ఫోన్ రేడియేషన్ స్థాయి 1.74 వాట్స్ పర్ కిలోగ్రామ్‌గా ఉంది.
రెండో స్థానంలో 1.68 వాట్స్ పర్ కిలోగ్రామ్ రేటుతో వన్‌ప్లస్ 5టీ ఉంది. జియోమీ ఎంఐ మాక్స్ 3 ఫోన్ కిలోగ్రామ్‌కు 1.58 వాట్స్ చొప్పున రేడియేషన్ విడుదల చేస్తున్నట్లు నివేదిక తెలిపింది.
అత్యధిక రేడియేషన్ స్థాయి ఉన్న తొలి 16 ఫోన్లలో 8 జియోమీ, వన్‌ప్లస్ బ్రాండ్‌ల ఫోన్లే. యాపిల్ ఐఫోన్ 7, ఐఫోన్ 8 కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఐఫోన్ 7 రేడియేషన్ స్థాయి 1.38 వాట్స్ పర్ కిలోగ్రామ్‌గా ఉంది.
శామ్‌సంగ్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లు తక్కువ రేడియేషన్‌ను వెలువరుస్తున్నట్లు జర్మన్ ఫెడరల్ ఆఫీస్ ఫర్ రేడియేషన్ ప్రొటెక్షన్ నివేదిక పేర్కొంది. శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8 రేడియేషన్ స్థాయి 0.17 వాట్స్ పర్ కిలోగ్రామ్‌గా ఉంది. గెలాక్సీ ఏ8, ఎస్8 ప్లస్, ఎస్7 ఎడ్జ్, ఎస్9 ప్లస్, ఎస్8 ఫోన్ల రేడియేషన్ స్థాయి కూడా 1 వాట్ లోపే ఉన్నట్లు స్టాటిస్టా నివేదిక తెలిపింది.