స్మార్ట్‌ ఫోన్‌ ప్రియులకు గుడ్ న్యూస్. ఎంతో మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జియోమీ అనుబంధ బ్రాండ్ ‘రెడ్‌ మి నోట్‌7’ త్వరలో భారత మార్కెట్‌లో రంగ ప్రవేశం చేయనున్నది. గురువారం ట్విట్టర్ వేదికగా  జియోమీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మను జైన్‌ ఈ సంగతి చెప్పారు. 

48 మెగా పిక్సెల్‌ కెమెరాతో ఫోన్‌ను భారత్‌లో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నట్టు జియోమీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మను జైన్‌ తెలిపారు. చైనాలో గత డిసెంబర్‌లో విడుదలైన ఈ స్మార్ట్‌ ఫోన్‌.. అవే ప్రత్యేకతలతో భారత్‌లో సైతం రానుందన్నారు.  పోటీదారులు తలకిందులు కానున్నాయని పేర్కొంటూ పరోక్షంగా ఆయన ట్విటర్‌ ఖాతా‌లో ఫోన్‌ చిత్రాన్ని పోస్ట్‌ చేసి చూపించారు.

షామీ నుంచి రెడ్‌మి స్వతంత్ర బ్రాండ్‌గా అవతరించిన తర్వాత వస్తున్న మొదటి ఫోన్‌ ఇదే కావడం విశేషం. దీని తర్వాత రెడ్‌మి నోట్‌‌ 7 ప్రో, రెడ్‌ మి గో రానున్నాయి.  చైనాలో ఈ ఫోన్‌ విడుదలైనప్పటి నుంచి భారత్‌కు ఎప్పుడు వస్తుంది? అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా చర్చ నడిచింది. ఈ ఫోన్‌ విడుదల తేదీపై జియోమీ కచ్చితమైన తేదీని చెప్పలేదు. ఫిబ్రవరి మధ్యలో లేదా నెలాఖరులో వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

రెడ్‌మి నోట్‌ 7ను చైనాలో అతి తక్కువగా 999 యువాన్లకు విక్రయిస్తున్నారు. మన భారత కరెన్సీలో అది రూ.10,500గా ఉంది. భారత మార్కెట్‌ దీని ధర కాస్త ఎక్కువగా ఉండొచ్చని వినికిడి. చైనాలో దీన్ని మూడు మోడల్స్‌లో విడుదల చేశారు. 3జీబీ ర్యామ్‌/32 జీబీ (999 యువాన్లు), 4 జీబీ ర్యామ్‌‌/64జీబీ (1199 యువాన్లు), 6 జీబీ ర్యామ్‌‌, 64జీబీ (1399 యువాన్లు) వేరియంట్లతో ఈ ఫోన్లను విడుదల చేశారు.

రెడ్ మీ నోట్‌ 7 ఫోన్‌లో 6.3 అంగుళాల పూర్తి హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఇక 2.2గిగాహెడ్జ్‌ స్నాప్‌డ్రాగన్‌ 660 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌‌తోపాటు  క్విక్ చార్జింగ్ సామర్థ్యం గల 4,000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ అమర్చారు. 48+5 మెగా పిక్సెల్‌ బ్యాక్ కెమెరా, 13 మెగా పిక్సెల్‌ సామర్థ్యం గల రేర్ కెమెరా ఉన్నాయి. ఇంకా ఆండ్రాయిడ్‌ ఓరియో, ఎంఐయూఐ 10 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.