మార్కెట్లోకి వన్ ప్లస్ 6టీ ఆవిష్కరణ: రూ.37,999తో ప్రారంభం
చైనా మొబైల్ మేజర్ ‘వన్ ప్లస్’ తాజాగా వన్ ప్లస్ 6టీ మోడల్ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.37,999తో మొదలవుతుంది.
ప్రముఖ చైనా మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ లేటెస్ట్ మొబైల్‌ను ఆవిష్కరించింది. వన్‌ప్లస్ 6టీ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. గత ఏడాది మేలో తీసుకొచ్చిన వన్‌ప్లస్ 6కి కొనసాగింపుగా దీన్ని తీసుకొచ్చింది.
ఈ ఫోన్ మూడు రకాల్లో లభించనున్నది. వీటిలో 6జీబీ ర్యామ్, 128జీబీ మెమొరీ కలిగిన మొబైల్ ధరను రూ.37,999గా నిర్ణయించింది. ఇంకా 8జీబీ ర్యామ్+128జీబీ మెమొరీ మోడల్ రూ.41,999గా, 8జీబీ ర్యామ్+256 జీబీ మెమొరీ కలిగిన మోడల్‌ను రూ.45,999లకు విక్రయిస్తున్నది. శుక్రవారం నుంచి వన్‌ప్లస్ స్టోర్లతోపాటు క్రోమా, రిలయన్స్ డిజిటల్‌లలో ఈ మొబైళ్లు లభించనున్నాయి.
6.41 అంగుళాల ఆప్టిక్ అమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఈ స్మార్ట్‌ఫోన్లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 16, 20 మెగాపిక్సెల్ రియర్ కెమెరాలు, వీడియోకాలింగ్ కోసం ముందుభాగంగా 16 మెగాపిక్సెల్ కెమెరా, 2340x1080 రెజల్యూషన్, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. రెండేండ్లపాటు ఆండ్రాయిడ్‌ను, మూడేండ్లపాటు సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించింది.
గతేడాది కంపెనీకి వచ్చిన ఆదాయంలో మూడోవంతు భారత్ నుంచి లభించడంతో ఇక్కడి మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు వన్ ప్లస్ వ్యవస్థాపకుడు కార్ల్ పై చెప్పారు. దీంట్లోభాగంగా హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, బెంగళూరు, ముంబై, పుణెలలో ఎక్స్‌పీరియన్స్ స్టోర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇప్పటికే భారత్‌లో 18 ఎక్స్‌క్లూజివ్ సర్వీస్ సెంటర్లు, 32 అనుబంధ సర్వీసింగ్ స్టేషన్లను నిర్వహిస్తున్నది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో 30 శాతం మార్కెట్ వాటా అంచనావేస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వీటితోపాటు రూ.1,490 విలువైన హెడ్‌ఫోన్‌ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు.