చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ భారతదేశ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల (రూ.50 వేల కన్నా ఎక్కువ) విభాగంలో ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మొదటి స్థానం దక్కించుకుంది. ఈ విభాగంలో పోటీదారులుగా ఉన్న యాపిల్‌, శాంసంగ్‌ బ్రాండ్లను వెనక్కి నెట్టి 37 శాతం మార్కెట్‌ విలువ‌తో మొదటి స్థానానికి ఎగబాకింది.

సోషల్ మీడియా వేదికగా వినూత్న ప్రచారం చేయడం, బ్రాండ్‌పై నమ్మకం పెంచేలా కార్యక్రమాలు నిర్వహించడం వంటివి ఈ స్థానం సంపాదనకు కారణాలని ఐడీసీ (ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌) ఇండియా సంస్థ నివేదిక పేర్కొంది. ఈ సంస్థ మూడు నెలలకోసారి దేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను నిర్ధారిస్తుంది.

రూ.40 వేల (400 డాలర్లు) విలువగల స్మార్ట్‌ ఫోన్ల విభాగంలో ఈ త్రైమాసికంలో వన్‌ప్లస్‌ అత్యధిక ఆర్డర్లను సంపాదించినట్లు నివేదిక పేర్కొంది. ఫలితంగా ఆన్‌లైన్‌ వేదికగా జరిగే ఒక్కో స్మార్ట్‌ఫోన్‌ సరాసరి అమ్మకపు విలువ (ఏఎస్‌పీ) 166 డాలర్లకు చేరిందని ఐడీసీ అసోసియేట్‌ రీసెర్చ్‌ మేనేజర్‌ ఉపాసన జోషి తెలిపారు. గతేడాది ఈ సమయానికి ఈ విలువ 156 డాలర్లు అని చెప్పారు.

6 సిరీస్ స్మార్ట్ ఫోన్‌తో వన్‌ప్లస్‌కు మరింత మేలు
వన్‌ప్లస్‌ 6 సిరీస్‌లో భాగంగా ఇటీవల విడుదలైన వన్‌ప్లస్‌ 6టీ స్మార్ట్‌ఫోన్‌‌తో ఆ సంస్థకు మరింత కలిసొచ్చే అవకాశముంది. ఇదే సమయంలో యాపిల్‌ నుంచి ఇటీవల విడుదలైన ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌, ఎక్స్‌ ఎస్‌ మ్యాక్స్‌ ఫోన్లకు భారత్‌లో అంతగా డిమాండ్‌ లేదు.

దేశీయంగా‌ వీటి ధరలు అధికంగా ఉండడమే ఇందుకు కారణమని నివేదిక విశ్లేషించింది. ఈ నెల 16 నుంచి అమెజాన్‌, వన్‌ప్లస్‌.ఇన్‌, సహా కొన్ని ఎంపిక చేసిన ఆఫ్‌లైన్‌ స్టోర్లలో వన్‌ప్లస్‌ 6టీ లభ్యం కానున్న సంగతి తెలిసిందే.

జియో తప్ప కాల్‌ డ్రాప్‌ పరీక్షలో అన్నీ ఫెయిలే
ఫోన్‌ కాల్‌ మాట్లాడుతుంటే ఒక్కసారి కట్‌ అయిపోతుంది. నెట్‌వర్క్‌ సిగ్నల్‌ బాగానే ఉందని మరోసారి ఫోన్‌ చేసి మాట్లాడుతుండగా.. కొంత సమయం తర్వాత మళ్లీ కట్‌ అయిపోతుంది. దీని వల్ల కస్టమర్లు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈ సమస్యను తీర్చాలంటూ టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌.. కంపెనీలను హెచ్చరిస్తున్నా తగిన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. తాజాగా కాల్‌ డ్రాప్‌ విషయమై ట్రాయ్‌ నిర్వహించిన పరీక్షలు రిలయన్స్‌ జియో తప్ప అన్ని కంపెనీలు ఫెయిల్‌ అయ్యాయి. 

అన్ని మార్గాల్లో పరీక్షించాకే ట్రాయ్ నివేదిక ఇలా
పలు జాతీయ రహదారులు, రైల్వే మార్గాల్లో ఈ పరీక్షను నిర్వహించిన ట్రాయ్‌ ఒక నివేదికను రూపొందించి విడుదల చేసింది. దీని ప్రకారం.. మూడు రైల్వే మార్గాల్లో జియో తప్ప ఏ టెలికాం కంపెనీ కూడా కాల్‌ డ్రాప్‌ బెంచ్‌మార్క్‌ను చేరుకోలేకపోయాయి.

కేవలం జియో మాత్రమే సర్వీసుల నాణ్యతకు సంబంధించిన బెంచ్‌మార్క్‌ను చేరుకున్నట్టు నివేదిక పేర్కొంది. సర్వీసు నాణ్యతకు సంబంధించిన నిబంధనల ప్రకారం.. ఒక టెలికాం సర్కిల్‌లోని నెట్‌వర్క్‌ పరిధిలో మొత్తం కాల్స్‌లో రెండు శాతం కన్నా ఎక్కువ కాల్స్‌ ఆటోమెటిక్‌గా డిస్‌కనెక్ట్‌ కాకూడదు.