వ్యాపారం పెంపు థీమ్: ఇక ‘వాట్సప్’లో ప్రకటనలు!
వాట్సప్ నుంచి సంపద స్రుష్టించాలని ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ సంకల్పించారు. అందులో భాగంగా వాట్సప్ ‘స్టేటస్’ ఫీచర్‌లో ప్రకటనలు కనిపించనున్నాయి. ఈ విషయాన్ని సంస్థ ఉపాధ్యక్షుడు క్రిస్ డేనియల్స్ ధ్రువీకరించారు.
ఇక ‘వాట్సప్’ వినియోగదారులకు ఇక నుంచి యాప్‌లోని స్టేటస్ సెక్షన్‌లో ప్రకటనలు కనిపించనున్నాయి. ఈ సంగతిని స్వయంగా సంస్థ ఉపాధ్యక్షుడు క్రిస్ డేనియల్స్ బుధవారం ధ్రువీకరించారు. ప్రకటనల ద్వారా వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే యోచనలో ఫేస్‌బుక్ ఉన్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఉచితంగా సేవలందిస్తున్న వాట్సప్ ఫర్ బిజినెస్ యాప్‌లో ఇక నుంచి ప్రకటనలకు ఫేస్‌బుక్ డబ్బు వసూలు చేయనున్నట్లు తెలిపారు. వాట్సప్ ఫర్ బిజినెస్‌లో వ్యాపారులు నమోదు చేసుకున్న ప్రకటనలు వాట్సప్‌కు ఇంటర్‌లింక్ అయి ఉంటాయని డేనియల్స్ చెప్పారు.
అయితే ఈ ప్రకటనల వ్యాపారం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే వివరాలు మాత్రం డేనియల్స్ వెల్లడించలేదు. కానీ వచ్చే ఏడాది నుంచి ఈ కొత్త వ్యాపార వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు ఓ ఆర్థిక సంస్థ నివేదిక పేర్కొంది. ప్రకటనలు అందరికీ ఒకేలా చేరతాయా? లేదా వినియోగదారుల ఆసక్తిని బట్టి ప్రకటనలు కనిపిస్తాయా? అనేది తేలాల్సి ఉంది.
వాట్సప్ నుంచి సంపద సృష్టికి ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ప్రయత్నిస్తున్నారని వాట్సప్ వ్యవస్థాపకుడు బ్రియన్ ఆక్టన్ ఇటీవల తెలిపారు. 2014లో 19 బిలియన్ డాలర్లను వెచ్చించి వాట్సప్‌ను ఫేస్‌బుక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో వాట్సప్‌కు 25 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు.