Asianet News TeluguAsianet News Telugu

‘రూపే’కు ప్రోత్సాహం సరే.. మా సంగతేంటన్న ‘మాస్టర్ కార్డ్’

భారతదేశంలో ‘రూపే’ కార్డుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా తమ ఆదాయానికి ప్రధాని మోదీ గండి కొడుతున్నారని అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్ టీఆర్)కు మాస్టర్ కార్డ్ పిర్యాదు చేసింది. జాతీయవాదం పేరిట ప్రధాని మోదీ ఆత్మరక్షణ విధానాలు అమలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. 
 

Mastercard lodged US protest over Narendra Modi's promotion of Indian card network RuPay
Author
Delhi, First Published Nov 4, 2018, 1:10 PM IST

భారత ప్రధాని నరేంద్రమోదీ జాతీయ వాదంతో దేశీయ చెల్లింపుల వ్యవస్థను వాడాలని ప్రోత్సహిస్తున్నారని అమెరికా ఫైనాన్సియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ‘మాస్టర్ కార్డ్’ ఆరోపించింది. భారతదేశం ఆత్మరక్షణ విధానాల వల్ల విదేశీ చెల్లింపుల సంస్థల వ్యాపారాలు దెబ్బ తింటున్నాయని అమెరికా ప్రభుత్వానికి ఆరు నెలల క్రితమే ఫిర్యాదు చేసింది. 

ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ప్రత్యేకించి 2016లో పెద్దనోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత దేశీయ చెల్లింపుల వ్యవస్థ ‘రూపే’లో భాగస్వాములు కావాలని పౌరులకు పిలుపునిస్తున్నారు. భారతీయులంతా అటువైు మళ్లితే అమెరికా పేమెంట్ జెయింట్స్ మాస్టర్ కార్డ్, వీసా సంస్థల లావాదేవీలపై గణనీయప్రభావం చూపుతుంది.

50 కోట్లకు పైగా డెబిట్, క్రెడిట్ కార్డులు రూపే పేమెంట్ సిస్టమ్ ద్వారా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విస్తరణ కోసం మాస్టర్ కార్డ్ వంటి సంస్థలు నానా అగచాట్లు పడుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ బహిరంగంగానే రూపేతో లావాదేవీల నిర్వహణ వల్ల మన ఆదాయం మన వద్దే ఉంటుందని, దాంతో దేశీయంగా అభివ్రుద్ది పనులు చేపట్టొచ్చని ప్రకటించారు. 

నరేంద్రమోదీ వైఖరిపై మాస్టర్ కార్డు జూన్ 21వ తేదీన అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్‌టీఆర్)కు రాతపూర్వకంగా ఫిర్యాదుచేసింది. జాతీయసేవను ద్రుష్టిలో పెట్టుకుని జాతీయవాదంతో రూపే కార్డుల వాడకాన్ని పెంచాలని ప్రధాని మోదీ కోరుతున్నారని ఆ ఫిర్యాదు సారాంశం. మాస్టర్ కార్డు గ్లోబల్ పబ్లిక్ పాలసీ ఉపాధ్యక్షుడు సహ్రా ఇంగ్లిష్ స్వయంగా ఈ ఫిర్యాదు చేశారు.  

డిజిటల్ పేమెంట్ సంస్థలు ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా దేశీయ వినియోగదారుల డాటాను ఇక్కడే భద్రపర్చాలన్న నిబంధన తమకు అదనపు వ్యయం తెచ్చి పెడుతుందని మాస్టర్ కార్డ్, వీసా వంటి సంస్థలు చెబుతున్నాయి. దీనిపై తీవ్ర నిరసన కూడా తెలిపాయి.

దీని నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా రూపే కార్డుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారని మాస్టర్ కార్డు చెబుతోంది. అంతర్జాతీయంగా పేమెంట్స్ నెట్ వర్క్ గల సంస్థ మాస్టర్ కార్డు. ప్రధాని నరేంద్రమోదీ ప్రోత్సాహంతో రూపే చెల్లింపుల నెట్ వర్క్ క్రమంగా అమెరికా పేమెంట్స్ టెక్నాలజీ సంస్థల మార్కెట్లోకి చొచ్చుకు వెళుతుండటమే మాస్టర్ కార్డు వంటి సంస్థలకు ఇబ్బందికరంగా మారింది.

భారత ప్రభుత్వ ఇన్షియేటివ్ లకు పూర్తిగా మద్దతుగా నిలుస్తున్నామని పేర్కొన్న మాస్టర్ కార్డు.. రూపే వినియోగం పెంపుపై యూఎస్ టీఆర్ కు ఫిర్యాదుచేసిన అంశంపై స్పందించేందుకు నిరాకరించడం గమనార్హం. ‘వీసా’ నెట్ వర్క్ కూడా స్పందించలేదు. మరోవైపు దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యాలయం ‘పీఎంఓ’ కూడా ప్రతిస్పందించకపోవడం ఆసక్తికర పరిణామం. 

మాస్టర్ కార్డు అధ్యక్షుడు సీఈఓ అజయ్ బంగా మాట్లాడుతూ 2014-19 మధ్య భారత మార్కెట్లో 100 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టాలని లక్షంగా పెట్టుకున్నట్లు చెప్పారు. భారతదేశంలో 2000 మంది సిబ్బందిని నియమించుకున్నది. అమెరికా తర్వాత మాస్టర్ కార్డు సిబ్బందిలో ఇది 14 శాతం. 

గత ఆగస్టులో భారతీయుల డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం 51 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. ఇది 2016 నవంబర్ నెలతో పోలిస్తే రెట్టింపు. అయితే భారత, విదేశీ చెల్లింపుల వివరాలు స్పష్టంగా ఆర్బీఐ ప్రకటించలేదు.

కానీ దేశీయంగా మొబైల్ వాలెట్ల వినియోగం, ప్రభుత్వ ఆధారిత డిజిటల్ మనీ ట్రాన్స్ ఫర్ సర్వీసులను ప్రధాని మోదీ ప్రోత్సహించడంతో భారతీయులంతా ‘రూపే’ కార్డుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రూపే కార్డును అధిగమించేందుకు మాస్టర్ కార్డు తన లావాదేవీల పన్నును సగానికి తగ్గించేసింది.

కానీ ఈ అంశాలపై ఖ్వాసీ రెగ్యులేటర్ గా ఉన్న ఎన్పీసీఐ స్పందించేందుకు నిరాకరించింది. సేవల చెల్లింపుల విషయానికి వస్తే మాస్టర్ కార్డు, వీసా నెట్ వర్క్ ల కంటే రూపే కార్డుకు సగం ఫీజు చెల్లిస్తే సరి.  కానీ రూపే కార్డుతో పోటీ పడేందుకు అమెరికా సంస్థలు తమ సర్వీసు బిల్లులను ఇటీవలి కాలంలో తగ్గించేశాయి.

కానీ బహిరంగంగా ఎక్కడా ప్రకటించడం లేదు. ప్రధాని నరేంద్రమోదీ మాత్రం దేశం కోసం ‘రూపే’ కార్డులను వాడాలని పదేపదే చెబుతున్నారు. డెబిట్ కార్డు లావాదేవీల రూపేణా తమకు 15-20 శాతం ఆదాయం వచ్చిందని, మిగతా అంతా భారత ఆర్థిక వ్యవస్థలోనే ఇమిడి పోయిందని మాస్టర్ కార్డ్ పేర్కొంది. కానీ రూపే పేరెత్తకపోవడం గమనార్హం. 
.............................

Follow Us:
Download App:
  • android
  • ios