భారత్‌లో ఖరీదైన ‘ప్రీమియం’ స్మార్ట్‌ఫోన్లకు కొనుగోలుదార్ల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రత్యేకించి రూ.30 వేలకు పైగా ధర గల ఫోన్ల కొనుగోలుకు వినియోగదారులు పోటీ పడుతున్నారు. 2018లో దేశీయ విపణిలో ఈ విభాగం ఫోన్ల కొనుగోళ్ల వృద్ధి ఎనిమిది శాతంగా నమోదవ్వడమే ఇందుకు నిదర్శనం. 

అక్టోబర్- డిసెంబర్ నెలల మధ్య ప్రీమియం ఫోన్ల కొనుగోళ్లలో వృద్ధిరేటు 16 శాతంగా నమోదైంది. వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో అటు కంపెనీలు కూడా దేశీయ ఖరీదైన ఫోన్ల విపణిపై పట్టు సాధించేందుకు వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా గతేడాది మార్కెట్‌ వాటాలో అగ్రస్థానం కోసం దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్‌, చైనా స్మార్ట్ ఫోన్ మేజర్ వన్‌ప్లస్‌ హోరాహోరీగా తలపడ్డాయి. 

ఒక్కటంటే ఒక్క శాతం అత్యధిక విక్రయాలతో శామ్‌సంగ్‌ మొదటి స్థానంలో నిలవగా.. వన్‌ప్లస్‌ రెండో స్థానంతో సరిపెట్టుకున్నది. 2018లో భారత్‌కు దిగుమతైన మొత్తం ఖరీదైన ఫోన్లలో శామ్‌సంగ్‌ వాటా 34 శాతం కాగా.. వన్‌ప్లస్‌ది 33 శాతం. 

అక్టోబర్- డిసెంబర్ నెలల మధ్య ప్రీమియం ఫోన్ల విక్రయాల్లో మాత్రం వన్‌ప్లస్‌దే అగ్రస్థానం. మొత్తం దిగుమతుల్లో ఈ చైనా సంస్థ వన్ ప్లస్ వాటా 36 శాతంగా ఉంది. ఇదే సమయంలో శామ్‌సంగ్‌ వాటా 26 శాతం మాత్రమేనని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ నివేదించింది.

‘డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలోనే కాక 2018 అసాంతం ఖరీదైన స్మార్ట్‌ఫోన్ల (రూ.30,000/ 400 డాలర్లు) ఎగుమతులు గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. మొత్తం మీద 2018లో ఈ విభాగం 8 శాతం వృద్ధిని నమోదు చేయగా.. ఒక్క డిసెంబరు త్రైమాసికంలో 16 శాతం వృద్ధి నమోదైంది’అని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక పేర్కొంది. 

అక్టోబర్- డిసెంబర్ నెలల మధ్య  వన్‌ప్లస్‌ సంస్థ అత్యధిక ఎగుమతులను నమోదుచేసింది. ఖరీదైన ఫోన్లకు సంబంధించి నాలుగో త్రైమాసికంలో వన్‌ప్లస్‌, యాపిల్‌, శామ్‌సంగ్‌ అత్యుత్తమ మూడు బ్రాండ్లుగా నిలిచాయి. మొత్తం ఫోన్ల కొనుగోళ్లలో ఈ మూడింటి వాటానే 92 శాతం కావడం గమనార్హం. 

డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో యాపిల్‌ ఖరీదైన ఫోన్ల ఎగుమతులు 25 శాతం తగ్గాయి. భారత్‌లో తయారీ కంటే దిగుమతి చేసుకునే ఫోన్లపై 20 శాతం దిగుమతి సుంకాన్ని చెల్లించేందుకు నిర్ణయం తీసుకోవడంతో ఈ ఫోన్ల ధరలు మరీ ఎక్కువగా కనిపిస్తుండటమే ఎగుమతులు తగ్గడానికి కారణం.

ఈ నేపథ్యంలో ధరలను కాసింతైనా తగ్గించే ఉద్దేశంతో 2019లో భారత్‌లో ఐఫోన్ల తయారీకి యాపిల్‌ శ్రీకారం చుడుతుందని భావిస్తున్నామని నివేదిక పేర్కొంది. 2018లో ఖరీదైన ఫోన్ల విభాగంలో యాపిల్‌ మార్కెట్‌ వాటా 23 శాతంగా ఉంది.

ఈ విభాగంలోకి ఖరీదైన చైనా బ్రాండ్ల అడుగు పెడుతుండటం, వన్‌ప్లస్‌, శామ్‌సంగ్‌, గూగుల్‌, హువావే విక్రయ, సరఫరా వ్యూహాలతో యాపిల్‌కు ఈ ఏడాది మరింత పోటీ ఎదురయ్యే అవకాశం ఉన్నదని నివేదిక పేర్కొన్నది.