ఇటీవల కొత్తగా ఆవిర్భవించిన ‘వొడాఫోన్ ఐడియా సెల్యూలార్’ తన కస్టమర్ల కోసం మూడు రకాల ఆకర్షణీయమైన ప్రీ ఫెయిడ్ రీచార్జీ ప్లాన్లను ప్రకటించింది. సమీప భవిష్యత్‌లో మరికొన్ని ప్లాన్లను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.  

దేశీయంగా ఇతర టెలికం సంస్థలతోపాటు వొడాఫోన్ ఐడియా సెల్యులార్‌ వినియోగదారుల మనస్సు చూరగొనడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. తన వినియోగదారుల కోసం మూడు సరికొత్త ఆఫర్లను తీసుకు వచ్చింది. ఇటీవల ఐడియాలో వొడాఫోన్ విలీనమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా విలీనం తర్వాత ఐడియా ఈ ఆఫర్లను తీసుకురావడం విశేషం. రూ.209, రూ.479, రూ.529 విలువ కలిగిన రీఛార్జ్‌లతో ఈ ఆఫర్లను ఐడియా అందిస్తోంది.

రూ.209తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల పాటు రోజుకు 1.5జీబీ డేటా చొప్పున వినియోగించుకోవచ్చు. అదే విధంగా అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ కాల్స్‌తో పాటు, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను సైతం పంపుకొనే వీలుంటుంది. ఇక రూ.479 రీఛార్జ్‌తో కూడా ఇవే ప్రయోజనాలను 84 రోజుల పాటు పొందవచ్చని ఐడియా తెలిపింది.

రూ.529తో రీఛార్జ్‌ చేసుకుంటే 1.5జీబీ డేటాతో పాటు, అపరిమిత కాల్స్‌, రోజే 100 ఎస్‌ఎంఎస్‌లను 90 రోజులు వినియోగించుకోవచ్చు. ఈ ఆఫర్లు అన్ని సర్కిళ్లకూ వర్తిస్తుందని వొడాఫోన్ ఐడియా తెలిపింది. దీంతోపాటు ప్రీపెయిడ్‌ వినియోగదారులకు మరో ఆఫర్‌నూ ప్రకటించింది. ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియోకు పోటీగా రూ.149రీఛార్జ్‌తో 28 రోజుల పాటు ఉచిత వాయిస్‌కాల్స్‌తో పాటు 33జీబీ డేటాను అందిస్తోంది. 

సమీప భవిష్యత్‌లో వొడాఫోన్ ఐడియా సెల్యూలార్ మరికొన్ని ప్రీ పెయిడ్ ప్లాన్లను అమలులోకి తేవాలని సంకల్పిస్తోంది. రూ.799, రూ.569, రూ.511 విలువ గల ప్రీ పెయిడ్ ప్లాన్లను అమలులోకి తేవాలని భావిస్తున్నది. భారతీ ఎయిర్ టెల్ సంస్థ కూడా ఇటువంటి ప్లాన్‌నే ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.